Chit Fund Scam: అన్నా…అక్కా అంటూ వరసలు కలిపి మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. చిట్టీలు వేయించుకున్నారు (Chit Fund Scam). గడువు పూర్తయిన తరువాత డబ్బు ఇవ్వకుండా రేపు మాపు అంటూ కాలం గడిపారు. అయిదు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసుకుని చివరగా మూటా ముల్లె సర్దుకుని ఉడాయించారు. దాంతో బాధితులు లబోదిదోమంటూ న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే…శంషాబాద్ బస్టాండ్ ప్రాంతంలో నివాసముంటున్న కవిత, పల్లెమోని సురేందర్ ముదిరాజ్ లు భార్యాభర్తలు. ఇద్దరు కలిసి ఇరవై ఏళ్ల క్రితం చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు. చిట్టీలు పాడుకున్న వారికి మొదట్లో సకాలంలో డబ్బులు ఇస్తూ అందరి నమ్మకాన్ని సంపాదించుకున్నారు.
Also Read: Bhatti Vikramarka: రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెంపుపై నివేదిక ఇవ్వండి: భట్టి విక్రమార్క
18లక్షల రూపాయలు ఇవ్వాలి
ఆ తరువాత వ్యాపారాన్ని అయిదు కోట్ల రూపాయలకు పైగా విస్తరించారు. వీరిని నమ్మిన శంషాబాద్ మధురానగర్ నివాసి మంచాల శ్రీనివాస్ అతని బంధువులు కూడా సురేందర్ దంపతుల వద్ద చిట్టీలు వేశారు. ఈ క్రమంలో ఒక్క శ్రీనివాస్ కే 18లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే, డబ్బు అడిగిన ప్రతీసారి ఇదుగో ఇస్తాం. అదుగో ఇస్తామంటూ కాలం గడుపుతూ వచ్చిన సురేందర్ దంపతులు రాత్రికి రాత్రి ఇంట్లో ఉన్ననగదు, బంగారు నగలు అన్ని మూటగట్టుకుని పారిపోయారు. దీనికి ముందే తమ పిల్లలను కూడా పంపించి వేశారు. బుధవారం వెళ్లి చూసేసరికి సురేందర్ ఇంటికి తాళం వేసి ఉండటం…ఫోన్లు చేస్తే భార్యాభర్తలిద్దరి మొబైళ్లు స్విచాఫ్ అని రావటంతో మోసపోయినట్టు గ్రహించిన శ్రీనివాస్ తోపాటు మరికొంతమంది బాధితులు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్నసురేందర్, కవితల కోసం గాలింపు మొదలు పెట్టారు.
Also Read: Press Meet Cancel: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ షాకింగ్ నిర్ణయం.. మీడియా సమావేశం రద్దు
క్యాప్స్ గోల్డ్ కంపెనీపై ఐటీ రెయిడ్స్
బంగారం వ్యాపారులే టార్గెట్ గా ఐటీ అధికారులు హైదరాబాద్, వరంగల్, విజయవాడలో తనిఖీలు చేపట్టారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బంగారం కొనుగోళ్లు…అమ్మకాల్లో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా అందిన సమాచారంతోనే ఐటీ అధికారులు ఈ దాడులు జరిపినట్టు సమాచారం. తనిఖీల్లో భారీగా అవకతవకలకు గుర్తంచినట్టుగా తెలిసింది. హైదరాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుంచి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తోంది. ఈ బంగారాన్ని రిటైల్ గోల్డ్ షాపులకు విక్రయిస్తోంది.
పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టినట్టుగా అధికారులకు సమాచారం
ఈ వ్యవహారంలో క్యాప్స్ గోల్డ్ కంపెనీ పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టినట్టుగా అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 15 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు క్యాప్స్ గోల్డ్ కంపెనీ యజమానుల ఇళ్లతోపాటు దుకాణాలపై దాడులు చేసి విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. బంజారాహిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ హెడ్ ఆఫీస్ లో కూడా సోగాలు చేశారు. ఈ క్రమంలో సదరు కంపెనీ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అధికారుల దృష్టికి వచ్చిందని సమాచారం. అదే సమయంలో బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొంటూ రిటైల్ గోల్డ్ వ్యాపారులకు అమ్ముతున్నట్టుగా కూడా సోదాల్లో బయట పడిందని తెలిసింది. క్యాప్స్ గోల్డ్ కంపెనీ ఛైర్మన్ చంద్ర పరమేశ్వర్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.
మహంకాళి స్ట్రీట్ లో…
ఇక, ఐటీ అధికారుల బృందాలు సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లోని పలువురు బంగారు వ్యాపారుల ఇళ్లల్లో కూడా తనిఖీలు జరిపాయి. పవన్ వర్మ అనే వ్యాపారి ఇంట్లో తెల్లవారుఝాము నుంచే సోదాలు చేస్తున్నాయి. పవన్ వర్మ కొన్నేళ్లుగా తిరుపతి బులియన్ పేరుతో కోట్లాది రూపాయల బంగారం వ్యాపారం చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే, పవన్ వర్మ భారీగా పన్ను ఎగ్గొట్టినట్టుగా అధికారుల తనిఖీల్లో బయట పడిందని తెలిసింది. ఈ క్రమంలో అతను చేసిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక, వాసవి గ్రూప్ లో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృతస్థాయిలో తనిఖీలు జరిపారు. క్యాప్స్ గోల్డ్ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ చందా, సౌమ్యా చందాలు వాసవిలో కూడా డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో వాసవి గ్రూప్ ఆఫీసులపై కూడా ఐటీ అధికారుల బృందాలు దాడులు చేశాయి. సోదాలు చేపట్టి కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశాయి.
Also Read: Osmania Medical College: అత్యాధునికంగా ఉస్మానియా దవాఖాన.. మారనున్న రూపురేఖలు!
