Jubilee Hills Bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు ఎంపీగా ఉండి జుబ్లీహిల్స్ కోసం కేంద్రం నుంచి రూ.1 అయినా తీసుకొచ్చారా? అని నిలదీశారు.
‘కిషన్ రెడ్డి.. సిగ్గుపడాలి’
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీజేపీ నేత కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారని షబ్బీర్ అలీ గుర్తుచేశారు. జుబ్లీహిల్స్ అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో.. ఎంపీగా కిషన్ రెడ్డికి అంతే బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగకపోవడానికి కిషన్ రెడ్డి కూడా ఒక కారణమని షబ్బీర్ అలీ అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలని పట్టుబట్టారు ‘ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి తేనందుకు సిగ్గు పడాలి’ అని ఘాటుగా మండిపడ్డారు.
‘ప్రజలకు క్షమాపణ చెప్పాలి’
ఎంపీగా ఉండి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనందుకు.. కిషన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో ఉన్నన్ని ప్రజా సంక్షేమ పథకాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. గతంలో పి. జనార్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.
Also Read: CM Revanth Reddy: సీఎంవో కార్యాలయం నుంచి అధికారుల లీకులతో ఇబ్బందులు.. సీరియస్‌గా తీసుకున్న సీఎం
కిషన్ రెడ్డి కీలక విజ్ఞప్తి
అంతకుముందు జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తలేదు.. మజ్లీస్ పార్టీ పాలిస్తుంది. పాతబస్తీలో మజ్లీస్ గుండాల కారణంగా చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మజ్లీస్ పార్టీ నిర్ణయించింది. జూబ్లీహిల్స్‌ను మరో పాతబస్తీగా మార్చాలని చూస్తున్నారు. తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజల కోసం బీజేపీ ఇక్కడ గెలవాలి. మజ్లీస్ పార్టీ కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌ను రక్షించుకోవాలి. మజ్లీస్‌కు అభివృద్ధి అవసరం లేదు. వాళ్లకు కావాల్సింది మత రాజకీయాలే’ అని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘మనకి మజ్లీస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలాంటి వ్యక్తి కావాలా? జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలిస్తే బాగుంటుందో ప్రజలు ఆలోచించాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు.
