Rangareddy Medchal: ఏళ్ల తరబడిగా చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ కొలిక్కి రావడం లేదు. హైకోర్టు ఆదేశాలతో నిర్ధారణ ప్రక్రియలో కొంత వేగం కనిపించినప్పటికీ ప్రస్తుతం ఆ స్థాయిలో జరగడం లేదన్న అభిప్రాయం విన్పిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,124 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా..ఇప్పటివరకు కేవలం 440కి పైగా చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఎఫ్‌టీఎల్ నిర్దారణలో జాప్యం జరుగుతుండడంతో ఆక్రమణలు పెరిగి భవిష్యత్తులో మరిన్ని చెరువులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తయితే చెరువులు ఆక్రమణలకు గురవ్వకుండా పరిరక్షించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఆక్రమణల్లో సగానికి పైగా చెరువులు
భూములకు డిమాండ్ వచ్చాక చెరువుల ఆక్రమణలు పెరిగిపోయాయి. ఎఫ్‌టీఎల్ పరిధి దాటి సైతం చెరువులను చెరబట్టారు. ఇంకా చెరబడుతూనే ఉన్నారు. రాత్రికి రాత్రే మట్టితో చెరువులను పూడ్చుతున్నారు. తెల్లారేసరికి అక్కడ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఆక్రమణలతో చాలావరకు చెరువులు రూపం కోల్పోయాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అతిక్రమణలు ఎక్కువగా జరగడంతో రెండు జిల్లాల పరిధిలోని 60 శాతానికి పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. రెవిన్యూ, ఇరిగేషన్, ఇతర విభాగాలు చెరువుల సంరక్షణకు సంగతిని పట్టించుకోకపోగా..అన్యాక్రాంతం కావడంలో తమవంతు పాత్ర పోషించాయి.
Also Read: Alcohol Addiction: మద్యం కోసం తాకట్లు.. రెండు వందలకు 2వేలు వసూళ్లు!
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఇష్టానుసారంగా మార్చేసి నిరభ్యంతర పత్రాలు(ఎన్‌వోసి)లను జారీ చేసి ఆక్రమణలకు ఊతమిచ్చారు. వీటి ఆధారంగా నిర్మాణాలకు అనుమతులు పొంది అక్రమార్కులు యథేచ్చగా పెద్దపెద్ద భవనాలను నిర్మించారు. ఫలితంగా వర్షం పడిన సందర్భాల్లో సమీప కాలనీలు మునగకు గురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్‌వోసీలతో సంబంధం లేకుండానే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీలు అనుమతులు జారీ చేశాయి. హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కూల్చివేస్తున్న వాటిల్లో ఎక్కువగా ఇలా అడ్డదారిన అనుమతులు పొందినవే
ఎక్కువగా ఉండడం గమనార్హం ఏళ్ల తరబడిగా సాగుతున్న సర్వే
ప్రతి చెరువుకు తుది ఎఫ్‌టీఎల్ నిర్ధారణ చేసి పక్కాగా హద్దులు నిర్ణయించడం ద్వారా ఆక్రమణలను నిరోధించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ది(హెచ్‌ఎండీఏ)సంస్థ 2013 సంవత్సరంలోనే సర్వేను మొదలు పెట్టింది. అయితే ఏళ్లతరబడిగా ఈ సర్వే సాగుతుండడంతో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించి తుది ఎఫ్‌టీఎల్ నివేదిక రూపకల్పనలో జాప్యం నెలకొంది. కొన్ని చెరువుల విస్తీర్ణం, సర్వే నంబర్లు, మ్యాపులు రెవిన్యూ, సాగునీటి శాఖల వద్ద వేర్వేరుగా ఉండడం వల్లనే ప్రాథమిక నోటిఫికేషన్ జారీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరోపక బీఆర్‌ఎస్ పాలనలో ఉద్దేశ్యపూర్వకంగానే సర్వేను నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
Also Read:GHMC – Entomology Service: దోమల నివారణ కోసం.. ఎంటమాలజీ సేవలు అమలు!
అయితే దీనిపై హైకోర్టు జోక్యం చేసుకోవడంతో గత రెండేళ్లుగా సర్వే పనులు వేగం అందుకున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ప్రక్రియలో మళ్లీ స్తబ్ధత నెలకొందన్న అభిప్రాయం విన్పిస్తోంది. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో 867 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయగా..260 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లాలో 531 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వగా 225 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ జారీ అయింది. తుది నోటిఫికేషన్ ఇచ్చిన చెరువులకు సంబంధించిన విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ప్రక్రియలో జాప్యం వల్ల నేటికీ చెరువుల ఆక్రమణలు జరుగుతూనే ఉంది. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తయితే చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని, తద్వారా అక్రమార్కుల చర్యలకు సైతం అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణ ప్రక్రియ త్వరితగతిన పూర్తయితే మ్యాపుల ఆధారంగా నిర్ధారించుకుని ప్లాట్ల కొనుగోలుదారులు మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
Also Read: Harish Rao on Congress: అవినీతిని ఆధారాలతో బయటపెడ్తాం.. మాజీ మంత్రి కామెంట్స్!