GHMC Delimitation: గూగుల్ మ్యాప్‌తో ల్యాప్ టాప్‌లో చేశారన్నతలసాని శ్రీనివాస్ యాదవ్
పునర్విభజన 74వ రాజ్యాంగ సవరణకు విరుద్దమన్న ఎమ్మెల్సీ శ్రవణ్
దారుస్సలంలో డీలిమిటేషన్ చేశారన్న బీజేపీ
కౌన్సిల్ మీటింగ్‌లో గెజిట్ పత్రాల చించివేత
మేయర్ ఎంట్రెన్స్ వద్ద బైఠాయింపు, నిరసన
ఎంఐఎం అభ్యంతరాలు అంతంతమాత్రమే
అధికార పార్టీ సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు
పునర్విభజనపై విమర్శనాస్త్రాలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీలోని (GHMC) పాత, పట్టణ స్థానిక సంస్థల విలీనంతో కొత్తగా ఏర్పాటు చేయనున్న మున్సిపల్ వార్డుల పునర్విభజనపై (GHMC Delimitation) విపక్షాలు మండిపడ్డాయి. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో విమర్శనాస్త్రాలను సంధించాయి. సర్కారు ఆదేశాల మేరకు 300 వార్డుల డ్రాప్ట్‌పై ఈ నెల 10 నుంచి అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న పాలకమండలి సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాలను సేకరించేందుకు మంగళవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ, ఎంఐఎం లకు చెందిన కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు డీలిమిటేషన్ డ్రాఫ్ట్‌లో స్వల్ప మార్పులను కోరుతూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఘాటైన విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (TalasanI Srinivas Yadav) మాట్లాడుతూ, పునర్విభజన ప్రక్రియ ఆగమేఘాలపై ఆగమాగంగా చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఏసీ రూమ్‌లలో కూర్చొని తమ ల్యాప్టాప్‌లలో గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఇష్టారాజ్యంగా పునర్విభజన చేశారని ఆరోపించారు. పునర్విభజన ప్రక్రియను గమనిస్తే వార్డుల సరిహద్దులు, జనాభా ఎక్కడికక్కడే అయోమయంగా ఉందన్నారు. కొన్ని వార్డుల్లో జనాభాను 18 వేల వరకు ఉండగా, మరి కొన్నింటిలో 58 వేలు, 65 వేల వరకు ఉన్నట్లు ఆయన కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. బాగ్ లింగంపల్లి, బాగ్ అంబర్ పేట వార్డులతో పాటు మోండా మార్కెట్ వార్డుల పునర్విభజనను ఇష్టారాజ్యంగా చేశారని, బాగ్ అంబర్ పేట పేరును డీడీ కాలనీగా మార్చారని, ఆ వార్డుకు పాత పేరునే పెట్టాలన్న పలు అభ్యంతరాలను కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కు సమర్పించినట్లు ఆయన సభా ముఖంగా వెల్లడించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా, అభిప్రాయ సేకరణ లేకుండా పునర్విభజనను చేశారని, కనీసం నగర ప్రథమ పౌరురాలైన మేయర్ కు సైతం సమాచారం లేకుండా చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, పునర్విభజన ప్రక్రియ మొత్తం రాజ్యాంగ విరుద్దంగా జరుగుతుందని, రాజ్యాంగ సవరణ 74ను ఉల్లంఘించి చిన్న చిన్న స్థానిక సంస్థల హక్కులు కాలరేసేలా, రూల్ నెంబర్ 5కు విరుద్దంగా విలీనం, పునర్విభజన ప్రక్రియలు జరిగిపోయాయని విమర్శించారు. ఎంఐఎం సభ్యులు అంతంతమాత్రంగా అభ్యంతరాలను లేవనెత్తుతూ పునర్విభజనను తాము స్వాగతిస్తున్నామన్నారు. అంతకు ముందు బీజేపీ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీకి లబ్ది చేకూర్చేలా, వారికి అనుకూలంగా ఉండేలా చిన్న చిన్న వార్డులను ఏర్పాటు చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Read Also- KTR: పంచాయతీ నిధులు, ఇందిరమ్మ ఇండ్లు మీ అబ్బ సొత్తు కాదు: కేటీఆర్
కౌన్సిల్ సమావేశం భోజన విరామం తర్వాత బీజేపీ కార్పొరేటర్లు తాము కూడా పునర్విభజనను వ్యతిరేకిస్తున్నామంటూ నినాదాలు చేయటంతో మేయర్ జోక్యం చేసుకుని ఇతర సభ్యులు మాట్లాడే సమయంలో మీరు జోక్యం చేసుకోవటం సరి కాదని సూచించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు డీలిమిటేషన్ పక్రియ మొత్తం దారుస్సలంలో జరిగిందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలుపుతూ, ఇందుకు నిరసనగా సర్కారు ఇటీవలే జారీ చేసిన గెజిట్ పత్రాన్ని చించి వేస్తుండటంతో, కాంగ్రెస్ సభ్యులు జోక్యం చేసుకుని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో ఇరు వర్గాలకు మేయర్ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, ఫలించలేదు. దీంతో మేయర్ కౌన్సిల్ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభను అర్థాంతరంగా వాయిదా వేయటాన్ని తప్పుబట్టిన బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేస్తూ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చి మేయర్ ఎంట్రెన్స్ వద్ద డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసిన కొందరు కార్పొరేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరిలించారు.

