Indiramma Housing Scheme: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో పథకం అమలును అధికార పార్టీ పక్కనబెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్(BRS) హయాంలో నిరుపేదలకు పక్కా ఇండ్లను సమకూర్చాలన్న సంకల్పంతో గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. వాటిలో 2023 ఎన్నికల ముందు కొన్నింటిని లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ స్కీమ్‌కు దీటుగా ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైందని లబ్ధిదారులు వాపోతున్నారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత గ్రేటర్ పరిధిలో సొంతిల్లు లేని పేదల నుంచి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం సర్కారు దరఖాస్తులను ఆహ్వానించగా, గ్రేటర్ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో ఏకంగా పది లక్షల దరఖాస్తులు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ ఈ దరఖాస్తులపై సర్వే కూడా నిర్వహించి, స్కీమ్‌కు అర్హులను, అనర్హులను కూడా గుర్తించి సర్కారుకు నివేదిక పంపినట్లు సమాచారం. నివేదికలను పంపి నెలలు గడుస్తున్నా, సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కనబెట్టినట్లు సమాచారం.
దరఖాస్తులను మూడు రకాలుగా..
గ్రేటర్ పరిధిలో సొంతిల్లు లేని పేదల నుంచి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Housing Scheme) పథకానికి సుమారు పది లక్షల దరఖాస్తులను స్వీకరించింది. వాటిని మూడు క్యాటగిరీలుగా విభజించి, సర్వే నిర్వహించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ మొత్తం దరఖాస్తుల్లో కేవలం 18 వేల మందికి సొంతింటిని నిర్మించుకునేందుకు కావల్సిన స్థలం ఉన్నట్లు మొదటి క్యాటగిరీగా లబ్దిదారులను గుర్తించారు. ఆ తర్వాత సొంత స్థలాలు ఉన్నా, పక్కా ఇళ్లు లేని వారిని రెండో క్యాటగిరీగా గుర్తించారు. మూడో క్యాటగిరీగా సొంత ఇల్లు, స్థలం లేని 8 వేల మందిని కూడా గుర్తించారు. మొత్తం స్వీకరించిన దరఖాస్తుల్లో కేవలం 18 శాతం మంది అసలైన లబ్ధిదారులుగా జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలో గుర్తించినట్లు తెలిసింది. ఈ సర్వే నిర్వహించి, సర్కారు నివేదికలను పంపిన సమయంలో లబ్ధిదారుల సంఖ్య చాలా తగ్గిందని సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read: Sankranthi Movies: సంక్రాంతి రేసు నుంచి రాజు తప్పుకుంటున్నాడా? కారణం ఆ తమిళ హీరోనేనా?
పైగా కోటి మంది జనాభా కలిగిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 18 వేల మంది లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఫుడ్ సేఫ్టీ వైట్ రేషన్ కార్డు మంజూరు చేసిన తర్వాత రీ సర్వే నిర్వహించి లబ్ధిదారుల సంఖ్యను అప్‌డేట్ చేయాలని సర్కారు భావించింది. ప్రస్తుతం ఈ విషయాన్ని అధికారులు గానీ, పాలకులు గానీ ఎవరూ ప్రస్తావించడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు వచ్చిన దరఖాస్తులపై గతంలో నిర్వహించిన సర్వే జరిగే నాటికి కొత్త ఫుడ్ సేఫ్టీ రేషన్ కార్డులు చాలా మందికి లేకపోవడంతో వారంతా అనర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ఇప్పుడు కొత్తగా తెల్లరేషన్ కార్డులను మంజూరు చేస్తున్నందున మరో సారి సర్వే నిర్వహిస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.
సొంత గూడు కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సొంత ఇళ్లు లేని బీపీఎల్(BPL) కుటుంబాలకు గత సర్కార్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ కోసం, ప్రస్తుత సర్కారు ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం చేసుకున్న దరఖాస్తులను పట్టుకుని మహిళలు, వృద్దులు రెవెన్యూ(Revenu), జీహెచ్ఎంసీ(GHMC) అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్(Congress) సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజా వాణి కార్యక్రమంలో భాగంగా డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంతో మంది పేదలు గంపెడు ఆశతో సొంతింటి కోసం దరఖాస్తులు సమర్పించారు. వీరిలో చాలా మంది రెవెన్యూ, జీహెచ్ఎంసీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సొంత స్థలం, ఇళ్లు లేని బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు సర్కార్ ఇప్పుడైనా మరో సర్వే నిర్వహించి, డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇండ్లను సమకూర్చాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
Also Read: AI photo controversy: దీపావళికి దీపికా పదుకోణె చూపించిన ‘దువా’ ఫోటో నిజం కాదా!.. మరి ఏంటంటే?
