Hyderabad Development: జీహెచ్ఎంసీలోకి 20 మున్సిపాలిటీలు, మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసి మెగా హైదరాబాద్‌గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. ఈ విలీనం కారణంగా తమ బాధ్యతలు మరింత పెరిగాయని వారు వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలు, మేయర్ ఎంట్రెన్స్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటేన్‌లను మేయర్, డిప్యూటీ మేయర్‌లు కలిసి ఆవిష్కరించారు. అనంతరం మహనీయులకు మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ ఆర్. వి. కర్ణన్, అదనపు కమిషనర్‌లు, విభాగ అధిపతులు, ఉద్యోగ సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం, ఫౌంటేన్‌ను ప్రారంభించుకోవటంతో ప్రధాన కార్యాలయానికి కార్పొరేట్ లుక్ వచ్చిందన్నారు.
Also Read: Hyderabad Crime News: నగరంలో తీవ్ర విషాదం.. వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్యలు!
దేశంలోనే అతిపెద్దగా
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకుల సహకారంతో పరిష్కారం లభించిందన్నారు. అనంతరం మేయర్ యూఎల్బీల విలీనంపై స్పందిస్తూ 27 పురపాలికల విలీన నిర్ణయంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. ఫలితంగా హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా అవతరించిందని తెలిపారు. విలీనమైన పురపాలికలు వేగంగా అభివృద్ధి చెందుతున్న జీహెచ్ఎంసీలో భాగం కావడం వల్ల ఇకపై హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చెందుతాయని, ప్రజలకు వేగంగా, సులభంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, ఏకకాలంలో 27 పట్టణ స్థానిక సంస్థలు విలీనం కావడం సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా శివారు స్థానిక సంస్థల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆమె తెలిపారు.
Also Read: Hyderabad Fire Accident: శాలిబండలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఒకరి మృతదేహం!

