Hyderabad Crime News: సంచలనం సృష్టించిన రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమైనట్టు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కూకట్ పల్లి స్పాన్ లేక్ అపార్ట్ మెంట్ లో ఉన్న స్టీల్ వ్యాపారి రాకేశ్ అగర్వాల్ భార్య రేణు అగర్వాల్ రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇంట్లో వంట మనిషిగా చేరిన హర్ష, హతురాలి బంధువు ఇంట్లో పని చేస్తున్న రోషన్ కలిసి రేణు అగర్వాల్ ను రైస్ కుక్కర్ తో తలపై కొట్టి ఆ తరువాత కత్తితో గొంతు కోసం నగదు, నగలతో రాకేశ్ అగర్వాల్ కు చెందిన స్కూటీపై ఉడాయించారు.
ఇద్దరూ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారే కావటం గమనార్హం. ఈ హత్య అన్నివర్గాల్లో తీవ్ర కలవరాన్నికలిగించిన నేపథ్యంలో రోషన్, హర్షల కోసం ఉన్నతాధికారులు పది ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపారు. ఈ బృందాలు రోషన్, హర్షలు పారిపోవటానికి ఉపయోగించిన స్కూటీని హఫీజ్ పేట వద్ద పార్క్ చేసి ఉండగా స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి రోషన్, హర్షలు రైల్లో తమ సొంత రాష్ట్రానికి వెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలా కానిపక్షంలో నగరంలోనే తల దాచుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. దీనిపై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ నిందితులకు సంబంధించి కీలక ఆధారాలు లభించాయని చెప్పారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.
Also Read: Woman Kills Husband: ఇదెక్కడి విడ్డూరం.. భర్తను దారుణంగా చంపి.. నేరం పులి మీదకు తోసిన భార్య
పోక్సో కేసుల్లో సంచలన తీర్పులు.. ఒకరికి 20యేళ్లు..మరొకరికి 10యేళ్ల చొప్పున శిక్షలు
మైనర్ బాలికను పెళ్లి చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకున్న యువకునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 15వేల రూపాయల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గొట్టిగారిపల్లికి చెందిన చైతన్యపురిలో ఉంటున్న కర్నె దినేశ్ ఎలియాస్ (29) మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. కాగా, దినేశ్ వేధింపులు రోజురోజుకు అధికమవుతుండటంతో బాధితురాలు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అప్పట్లో చైతన్యపురి స్టేషన్ సీఐగా ఉన్న బీ.రవికుమార్ కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. కేసును విచారించిన కోర్టు దినేశ్ కు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. అదే సమయంలో బాధితురాలికి 5లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందించాలని ఆదేశించింది.
మాయ మాటలతో కిడ్నాప్ చేసి…
మాయ మాటలతో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితునికి అత్యాచారం కేసులో పదేళ్లు, కిడ్నాప్ కేసులో అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ లోని పోక్సో యాక్ట్ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి నేతాజీనగర్ నివాసి సందీప్ (29) వృత్తిరీత్యా డ్రైవర్. తాను ఉంటున్న ప్రాంతంలోనే నివాసముంటున్న ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్న సందీప్ తరచూ స్కూల్ వద్దకు వెళ్లి కలవటం మొదలు పెట్టాడు. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు పాఠశాల మానిపించారు. అయితే, 2020, జనవరి 8న బాలికకు ఫోన్ చేసిన తాను చెప్పిన చోటుకు రావాలని, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. దాంతో బాధితురాలు అతని వద్దకు వెళ్లింది. ఆ తరువాత తన బంధువు ఇంటికి చిన్నారిని తీసుకెళ్లిన సందీప్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ మేరకు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేయగా చందానగర్ సీఐ బీ.రవీందర్ కేసులు నమోదు చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన కోర్టు నిందితుడైన సందీప్ కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బాధితురాలికి 3లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రియల్టర్ దారుణ హత్య అందరూ చూస్తుండగానే ఘాతుకం
అడ్డుకోవటానికి ఓ బైకర్ ప్రయత్నించగా అతన్ని బెదిరించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్య కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగాపురం కాలనీ నివాసి శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాగా, శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి అతన్ని బయటకు పిలిచాడు. బయటకు రాగానే వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. ఆ సమయంలో అటుగా బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి అడ్డుకోవటానికి ప్రయత్నించగా కత్తి చూపించి బెదిరించాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్ రెడ్డి రక్తం మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలియగానే కుషాయిగూడ పోలీసులు నేరస్థలానికి వచ్చారు. పంచనామా జరిపి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్థిక విభేధాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు.
Also READ: Anushka Shetty: సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క.. గుడ్ బై ? షాక్ లో ఫ్యాన్స్