Hydra: ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామం అని కర్ణాటక బృందం హైడ్రాను కొనియాడింది. చెరువుల పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయని కర్ణాటకలోని బెంగళూరును సందర్శించిన హైడ్రా.. నెలల్లోనే మెరుగైన పనితీరుతో హైదరాబాద్‌లో ఫలితాలు సాధించిందని అభినందించారు.
బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పాటు నగరంలో మొదటివిడతగా హైడ్రా పునరుద్ధరించిన పలు చెరువులను కర్ణాటకలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. అనంతరం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసి చెరువుల పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను.. వాటిని అధిగమించిన తీరును అడిగి తెలుసుకుంది. బెంగళూరులోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ జరుగుతున్న తీరును పరిశీలించిన హైడ్రా.. అనతి కాలంలోనే తాము ఇక్కడకు వచ్చి చూసేలా చెరువులను పునరుద్ధరించిందని కర్ణాటక బృందం ప్రశంసించింది.
Also Read: KTR on BC Reservations: సీఎం రేవంత్ బీసీ ద్రోహి.. తడిగుడ్డతో గొంతు కోశారు.. కేటీఆర్ ఫైర్
‘బతుకమ్మకుంటను చూశాం. ఆక్రమణలకు గురై నాడు ముళ్ల పొదలతో ఉన్న చిత్రాలను, వీడియోను చూశాం. నేడు అక్కడ నయనమనోహర దృశ్యం కనిపించింది. ఆక్రమణలు తొలగించి ఏకంగా చెరువును సృష్టించిన తీరు అద్భుతం’ అని కర్ణాటక బృందం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను అభినందించింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా వరద ముంచెత్తలేదని స్థానికులు చెప్పిన విషయాన్ని కమిషనర్‌కు తెలిపారు. ఇదే పరిస్థితి మిగతా చెరువుల చెంత ఉందని కొనియాడారు.
