Hydraa: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద ముప్పునకు సంబంధించిన ఫిర్యాదులు హైడ్రా ప్రజావాణికి అధికంగా వస్తున్నాయి. హైడ్రా(Hydra)కు అందిన మొత్తం 39 ఫిర్యాదుల్లో నాలాలు, చెరువుల కబ్జాలపైనే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అక్రమ కబ్జాల కారణంగానే కాలనీలు, రహదారులు ముంపునకు గురవుతున్నాయని ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.
Also Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం.. జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత
ప్రధాన ఫిర్యాదులు..
నాచారం పారిశ్రామిక వాడలోని సింగం చెరువు నుంచి సింగం చెరువు తండాకు వెళ్లే నాలాను కబ్జా చేయడంతో వరదలు తమ నివాసాలను ముంచెత్తుతున్నాయని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. గ్రామ రికార్డుల ప్రకారం సర్వే చేసి కబ్జాలను తొలగించాలని కోరారు. సంతోష్ నగర్ డివిజన్‌లోని ఐఎస్ సదన్ ప్రాంతం, లంగర్‌హౌస్(Langarhouse)లోని బాపూఘాట్, టోలీచౌక్ వంతెన పరిసరాలు వర్షాలకు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రి పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో పంజాగుట్టలోని కొన్ని కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, జూబ్లీహిల్స్‌లోని సీవీఆర్ న్యూస్ వద్ద నిలిచిపోయిన వరద నీటిని పక్కనే ఉన్న కేబీఆర్ పార్కులోకి మళ్లిస్తే సమస్య పరిష్కారమవుతుందని జర్నలిస్టు కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణలు..
మేడిపల్లి మండలం పర్వతాపూర్ సాలార్‌జంగ్ కంచ్‌లోని 38 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వాటిని తక్షణమే నిలిపివేయాలని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కాప్రా, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్‌లోని గోపాల్‌రెడ్డి నగర్ లే-అవుట్‌లో పార్కులు, రోడ్లకు కేటాయించిన స్థలాలను అక్రమంగా ప్లాట్లుగా విక్రయిస్తున్నారని గోపాల్‌రెడ్డి నగర్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్యాదు చేసింది. గతంలో లే-అవుట్ వేసిన వారి వారసులే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన రెండున్నర ఎకరాల భూమిని ఒక స్థానిక నాయకురాలు కబ్జా చేశారని, ఆ భూమిని తిరిగి దేవస్థానానికి అప్పగించాలని స్థానికులు కోరారు. హైడ్రా(Hydra) అధికారులు ఈ ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: VC Sajjanar – Rajinikanth: మాకు డబ్బే ముఖ్యమనుకునే వారంతా రజినీ గురించి తెలుసుకోండి!