Hyderabad: హైదరాబాద్ మాధాపూర్ లోని తమ్మిడికుంట చెరువు, కూకట్ పల్లిలోని నల్లచెరువు అభివృద్ధి పనులు నవంబరు నాటికి పూర్తి కావాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఈ రెండు చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ రెండు చెరువులు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు. శిల్పారామం, మెటల్ చార్మినార్ వైపుల నుంచి వచ్చే ఇన్ లెట్ల అభివృద్ధిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్ లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్ బయటవైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని.. చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండాలన్నారు. 14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని.. అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభివృద్ధి చేయాలని సూచించారు.
శిల్పారామం వైపు ప్రధాన ప్రవేశం
ఓ వైపు హైటెక్ సిటీ మరోవైపు శిల్పారామం ఉండటంతో తమ్మిడికుంట చెరువు ప్రధాన ప్రవేశ మార్గం కూడా వాటివైపే ఉండేలా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. అలాగే చెరువుకు చుట్టూ రహదారుల నిర్మాణం జరగాలని.. చెరువులోకి డ్రైనేజీ కలవకుండా చూడాలని సూచించారు. తమ్మిడికుంట చెరువు నుంచి వరద నీరు బయటకు సాఫీగా వెళ్లేలా అలుగు, వరద కాలువ నిర్మాణాలు జరగాలని సూచించారు. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉన్న పాదాచారుల మార్గం చుట్టు ప్రాణ వాయువు, చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని.. బయటకు.. తమ్మిడికుంట చెంత కనీసం 3 నుంచి 4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలని సూచించారు.
Also Read: FUNKY Movie Teaser: ‘ఫంకీ’ టీజర్ రిలీజ్.. విశ్వక్ నోట అనుదీప్ మార్క్ పంచ్‌లు.. హిట్ కొట్టేలాగే ఉన్నారుగా!
నల్లచెరువు చెంత సేదదీరేలా..
‘కూకట్ పల్లిలోని నల్లచెరువు చుట్టూ వేలాది నివాసాలున్నాయి. లక్షలాదిమంది నివసిస్తున్నారు. వీరందరూ సేదదీరేలా నల్లచెరువును అభివృద్ధి చేయాలి’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. నల్లచెరువు చుట్టూ పాత్ వేను విశాలంగా అభివృద్ధి చేస్తే.. స్థానికులు పెద్ద ఎత్తున వాకింగ్ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. అలాగే చెరువు ప్రధాన ప్రవేశ ద్వారం విస్తీర్ణం పెంచాలని.. ఆ పక్కనే పిల్లలు, పెద్దలు సేదదీరే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు ఇన్ లెట్, ఔట్ లెట్ లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. చెరువులోకి మురుగు నీరు కలవకుండా.. నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులకు సూచించారు. గతంలో 17 ఎకరాల మేర ఉన్న చెరువు ఆక్రమణలను తొలగించి 27 ఎకరాలుగా తీర్చిదిద్దుతున్న తీరును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చెరువు అభివృద్ధితో మా ప్రాంతం ఆహ్లాదకరంగా మారిందంటూ కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
