Hydra: రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడి, దాని చుట్టూ ఫెన్సింగ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు హైడ్రా (Hydra) వెల్లడించింది. రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా, అక్కడి నుంచి సమీపంలోనే ప్రజావసరాలకు ఉద్దేశించిన 4300 గజాల స్థలాన్ని శనివారం కాపాడింది. కొండపూర్, రాజరాజేశ్వరి నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీలో 4300 గజాల స్థలానికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్గించినట్లు హైడ్రా వెల్లడించింది. 1978 లో వేసిన గ్రామ పంచాయతీ లే అవుట్‌లో మొత్తం 350 ప్లాట్లు ఉన్నాయని, ఇక్కడ పాఠశాల భవనంతో పాటు ఇతర ప్రజావసరాల కోసం 4300 గజాల స్థలాన్ని అప్పట్లో లేఅవుట్ చేసిన చింతల పోచయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఈ స్థలాన్ని చూపించారు.
Also Read: Hydra: జర్నలిస్టులకు కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా!
అగ్రిమెంట్ కుదుర్చుకుని దందా?
అదే స్థలాన్ని లేఔట్ వేసిన పోచయ్య తో పాటు ఆయన కుటుంబ సభ్యుడు చింతల రాజు మూడు భాగాలుగా విభజించి లావాదేవీలు నిర్వహించడంలో కొళ్ల మాధవ రెడ్డి హస్తం ఉందని తప్పుడు డాక్యుమెంట్లతో అమ్మకాలు చేశారంటూ వాపోయారు. కొళ్ల మాధవరెడ్డి కుమారుడు ఒక భాగాన్ని కొనగా, చింతల పోచయ్య, చింతల రాజు పేరిట మీద రెండు భాగాలున్నట్టు డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మూడు భాగాల్లో కొళ్ల మాధవరెడ్డి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుని దందా నడుపుతున్నట్లు గుర్తించినట్లు హైడ్రా వెల్లడించింది. ఇదే విషయాన్ని కాలనీ ప్రతినిధులు జీహెచ్ఎంసీకి గతంలో ఫిర్యాదులు చేశారు.
4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్
ఎలాంటి చర్యలు తీసుకోలేనని కాలనీ వాసులు వాపోయారు. దీంతో హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణలు నిజమేనన్న విషయాన్ని నిర్థారించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అక్కడ ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా పేర్కొంది. 4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. అలాగే అక్కడ భూమిని అమ్మిన పోచయ్య, రాజుతో పాటు స్థలాన్ని కొనుగోలు చేసిన కొళ్ల మాధవరెడ్డి తో పాటు అతని కుమారుడిపైన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులను నమోదు చేయించినట్లు హైడా శనివారం వెల్లడించింది.
పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని ఓ పార్కును కూడా హైడ్రా శనివారం కాపాడింది. సర్వే నెంబరు 164లో శ్రీ సాయి సూర్య ఫేజ్-2 లో పార్కు కోసం దాదాపు 520 గజాల స్థలాన్ని అప్పట్లో కేటాయించారు. 1972లో వేసిన ఈ లే ఔట్‌లో పార్కు కోసం కేటాయించిన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, పార్కు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని శ్రీ సాయి సూర్య కాలనీ నివాసితులు హైడ్రాకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా విచారణ పూర్తి చేసింది. శనివారం ఉదయం పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దీంతో శ్రీ సాయి సూర్య కాలనీ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి మద్ధతుగా నినాదాలు చేశారు. దశాబ్దాలుగా పార్కు అభివృద్ధిని అడ్డుకున్న వారి చెర నుంచి పార్కును విడిపించిన హైడ్రా అధికారులను స్థానికులు అభినందించారు.
Also Read: Hydra: గోషామహల్ నియోజకవర్గంలో.. రూ. 110 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
