Hydra: గ్రేటర్ పరిధిలోని పార్కుల పరిరక్షణపై హైడ్రా యాక్షన్ మొదలు పెట్టింది. నిజాంపేట మున్సిపాలిటీలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును, కౌశల్యా కాలనీలోని 300ల గజాల పరిధిలోని బనియన్ ట్రీ పార్క్ స్థలానికి కబ్జాల నుంచి విమక్తి కల్గించింది. 2600ల గజాల స్థలం విలువ రూ. 39 కోట్లకు పైగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్ర స్థాయిలో విచారించిన అధికారులు పార్కు స్థలాలుగా గుర్తించి బుధవారం ఆక్రమణలను తొలగించింది. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు పిల్లా పాపలతో పార్కుకు వచ్చి సంబరాలు చేసుకున్నారు.
Also Read: Hydra: జర్నలిస్టులకు కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా!
పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్
సర్వే నంబరు 93లో ఉన్న ఈ స్థలాన్ని పార్కు స్థలంగా గతంలోనే నిర్ధారించారు. సర్వే నంబరు 94 కి సంబంధించిన ల్యాండ్‌గా స్థానికంగా పేర్కొంటూ స్థానికంగా ఉన్నవారు కబ్జా చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పార్కు స్థలంలోని పిల్లల ఆటవస్తువులు ధ్వంసం చేసి, పార్కు బోర్డును తొలగించి ప్రహరీని కూడా కూల్చేసి కబ్జా చేశారు. బృందావన్ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా, హైడ్రా సంబంధిత స్థానిక అధికారులతో పరిశీలించి పార్కు స్థలంగా నిర్ధారించింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. పార్కులను కాపాడినట్టు సూచిస్తూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. దీంతో బృందావన్ కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాను తెచ్చిన ప్రభుత్వానికి, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి పార్కులను కాపాడిన హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Hydra: కొండాపూర్‌లో రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
