HYDRA: ధనదాహంతోనే భూ కబ్జాలు
ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కాపాడాలి
హైడ్రా ప్రజావాణికి అందిన 61 ఫిర్యాదులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కబ్జాదారుల ధనదాహంతోనే ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని హైడ్రా ప్రజావాణిలో (HYDRA) ఫిర్యాదుదారులు వాపోయారు. ఆర్థిక, అంగబలంతో చేస్తున్న కబ్జాలను నియంత్రించి ఆయా ప్రాంతాల్లో ఉన్న వేలాదిమందికి ప్రయోజనం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా హైడ్రా చర్యలను అభినందించారు. అదే భరోసాతో తాము కూడా వచ్చామని పలువురు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మల్లాపూర్ విలేజ్‌లో ఏఎంఆర్ టౌన్‌షిప్‌లో 2 పార్కులతో పాటు రెండు రహదారులను ఆక్రమించారంటూ టౌన్‌షిప్ నివాసితుల ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అలాగే, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూరం సాయినగర్ కాలనీలో నాలా పక్కన ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని శ్రీ సాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అమీర్‌పేట మండలం సంజీవరెడ్డి నగర్ సర్వే నెంబరు 102/1, 102/3 లో 1550 గజాల స్థలం పార్కు కోసం కేటాయించగా, దానిని కబ్జా చేస్తున్నారంటూ అక్కడి నివాసితులు వాపోయారు. ఇలా నగరం నలుమూలల నుంచి సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 61 ఫిర్యాదులందినట్లు అధికారులు తెలిపారు. వీటిని హైడ్రా అదనపు కమిషనర్ ఎన్ అశోక్ కుమార్ పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
ఫిర్యాదులు ఇలా..
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పెద్ద చెరువుకు ఉన్న అలుగు ఎత్తు పెంచడమే గాక, ఉన్న నాలుగు తూములను పూర్తిగా మూసేయడంతో ఏటా దాని విస్తీర్ణం పెరిగిపోయి పై భాగంలో ఉన్న లే అవుట్ లన్నీ మునిగిపోతున్నాయని ప్లాట్ యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో 93 ఎకరాల మేర ఉన్న చెరువు ఇప్పుడు 400 ఎకరాలకు పైగా విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఈ చెరువు నుంచి నీళ్లు బయటకు పోకపోవడంతో కింద ఉన్న కుమ్మరికుంట, బందంకొమ్ము, శాంబునికుంట, ఇసుకబావి చెరువులకు నీరందక అవి కబ్జాలకు గురవుతున్నాయని ఫిర్యాదులో వివరించారు. దాదాపు 4 దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యను హైడ్రా వెంటనే పరిష్కరించాలని కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడ సర్వే నెంబర్ 44, 45లో పాఠశాల భవనానికి కేటాయించిన 1967 గజాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతోంది. వెంటనే ఈ స్థలానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో శ్రీ వెంకట సాయి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
Read Also- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ లోని సర్వే నెంబరు 75లో ప్రభుత్వ భూమి 1.23 ఎకరాల ఉంది. అందులో 1.10 ఎకరాలు ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని కాపాడడంతో పాటు పార్కు కోసం కేటాయిస్తే శ్రీరాంనగర్ నివాసితులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని హైడ్రా ప్రజావాణిలో అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. గతంలో వంద ఎకరాల భూమిలో వెయ్యికి పైగా ప్లాట్లతో శ్రీరాంనగర్ కాలనీ లే అవుట్ వేశారు. ఇందులో ఎక్కడా పార్కు కోసం గజం స్థలం కూడా వదల్లేదని, నాలా పక్కన ఉన్న 1.10 ఎకరాల భూమిని పార్కు కోసం కేటాయించాలని ఆ కాలనీ ప్రతినిధులు కోరారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేటలోని మేడికుంట చెరువును కాపాడాలంటూ అక్కడి నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 24.19 ఎకరాలున్న చెరువుకు ఒక వైపు 80 అడుగుల రహదారి ఉండగా, లోపలి వైపు నుంచి ఆక్రమణలు గురౌతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ్మిడికుంట – సున్నం చెరువు మధ్య ఈ చెరువు అనుసంధానంగా ఉండేదని, ఇప్పుడీ చెరువు ఆక్రమణలకు గురైతే, భూగర్భ జలాలకు ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. వెంటనే ఆక్రమణలు తొలగించి పూర్తి స్థాయిలో చెరువును అభివృద్ధి చేయాలని కోరారు.
