Hydra: గాజుల రామారంలో ఆక్రమణలను కూల్చేసిన హైడ్రా
భూమి స్వాధీనం చేసుకున్న అధికారులు
రెవెన్యూ, హైడ్రా, పోలీసుల జాయింట్ ఆపరేషన్
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన భూమిగా నిర్ధారణ
ఆక్రమణలను అడ్డుకున్న స్థానికులు, బైఠాయింపు
స్థానికంగా ఉద్రిక్తత.. పేదల రోదనలు, వేదనలు
నివాసాల జోలికెళ్లటం లేదన్న హైడ్రా
స్థలాలు కొనుగోలు చేశామంటూ స్థానికుల వాగ్వాదం
పట్టాలు, ఇతర డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీయేనని తెల్చిన హైడ్రా
రోడ్డున పాడేశారంటూ పేదల ఆవేదన
ఆకలవుతుందంటూ చిన్నారుల రోదన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: హైదరాబాద్‌లోని సర్కారు భూముల పరిరక్షణకు హైడ్రా (Hydra) మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన భూమిని ఆదివారం ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆదివారం స్వాధీనం చేసుకుంది. అంతేగాక, ఈ భూమి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు చెందినదిగా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లోని సుమారు 317 ఎకరాల్లో వెలసిన ఆక్రమణలను హైడ్రా ఆదివారం ఉదయం ఫుల్ ఫోర్స్ తో వచ్చిన హైడ్రా, రెవెన్యూ, పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ భూమిని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించినట్లు రెవెన్యూ, హైడ్రా అధికారులు నిర్థారించున్న తర్వాతే క్షేత్ర స్థాయిలో యాక్షన్ కు దిగినట్లు హైడ్రా చెబుతున్నా, తాము ఈ భూమిని కొనుగోలు చేసి మరీ నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని స్థానికులు వాదిస్తున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన హైడ్రా, రెవెన్యూ అధికారులను ఉదయం స్థానికులు అడ్టుకున్నారు.
హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డపై బైఠాయించారు. భారీగా పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆక్రమణల కూల్చివేతలను అడ్డుకున్న స్థానికులను అదపు చేశారు. అయినా స్థానికులు అడ్డుకోవటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్ 307 లోని సుమారు 40 ఎకరాల్లో భూమిలోనే కొందరు రియల్టర్లు, రాజకీయ నేతలు ఆక్రమించుకున్నట్లు హైడ్రా గుర్తించింది. హైడ్రా కూల్చివేతలు చేపట్టిన గాజుల రామారంలో నివాసాలేర్పాటు చేసుకున్న కొందరు కూలీలు తాము కూలీ చేసుకుని, కడుపు గట్టుకుని పైసా పైసా కూడబెట్టుకుని స్థలం కొని, కొన్ని తాత్కాలిక, మరి కొన్ని శాశ్వత నిర్మాణాలుగా ఇండ్లు కట్టుకున్నామని ప్రత్రాలను చూపుతూ స్థానికులు కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. హైడ్రా కూల్చివేతలతో ఇపుడు తాము రోడ్డున పడ్డామని కంటతడి పెట్టారు. అయినా ఆక్రమణలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. రాజకీయ నేతలు, రియల్టర్లు ఫేక్ డాక్యుమెంట్లు, పట్టాలను సృష్టించి 275 ఎకరాలను అక్రమంగా ఆక్రమించి, వాటిల్లో షెడ్డులను, కాంపౌండ్ వాల్స్ ను నిర్మించారని ప్రస్తుతం ఆ భూమిని పరిరక్షించేందుకు, అక్కడి షెడ్లు, కాంపౌండ్ వాల్స్ ను మాత్రమే తొలగిస్తున్నామని హైడ్రా అధికారులు చెబుతుండగా, మూడు రోజులుగా కూల్చివేతలను చేపడుతున్నారని, షెడ్లు, కాంపౌండ్ వాల్స్ తో పాటు నివాసాలను కూడా కూల్చేస్తున్నారని, తాత్కాలిక నివాసలేర్పాటు చేసుకుని నివసిస్తున్న పేదలు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also- Cattle smuggling: చర్ల టు కురవి వయా భద్రాచలం.. ఎన్నో ఏళ్లుగా అక్రమంగా పశు రవాణా
పేదలను ముందుంచి..కబ్జా యత్నం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని కొందరు రియల్టర్లు, రాజకీయ నాయకులు పేదలను ముందుంచి సర్కారు భూమిని ఆక్రమించి, వెంచర్లు, ప్లాట్లు చేసి విక్రయిస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే యాక్షన్ చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. పైగా ఈ స్థలంలోని ఆక్రమణలపై ఇదివరకే ప్రజావాణిలో ఫిర్యాదులు కూడా అందినట్లు ఆయన వివరించారు. ప్రతి ఫిర్యాదును టెక్నికల్‌గా, రికార్డుల ప్రకారంగా అన్ని రకాలుగా విచారించిన తర్వాతే హైడ్రా యాక్షన్ తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ స్థలానికి సంబంధించి ఇప్పటివరకు రెవెన్యూ విభాగం అధికారులతో హైడ్రా అధికారులు ఐదారుసార్లు సమావేశాలు నిర్వహించి, ఇక్కడి నిర్మాణాలు ముమ్మాటికీ ఆక్రమణలమేనన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Read Also- OG movie: ‘ఓజీ’ టీంపై మండిపడుతున్న అభిమానులు.. ఎందుకంటే?
బాధ్యులపై చర్యలు తప్పవు
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలోని సర్వే నెంబర్ 307 లో ని 315 భూని కబ్జా చేసేందుకు పేదలను ముందుంచి, వారికి ఫేక్ పట్టాలతో భూములను విక్రయించిన రియల్టర్లు, రాజకీయ నేతలపై చర్యలు తప్పవని కూడా హైడ్రా స్పష్టం చేసింది. తాము భూమి కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని కొందరు పేదలు చెబుతున్నా, వారికి నాయకులు, రియల్టర్లు ఇచ్చిన పట్టాలు, ఇతర పేపర్లన్నీ ఫోర్జరీ చేసినవిగా హైడ్రా నిర్థారించింది. మిగిలిన భూమిని కూడా విక్రయించేందుకు రియల్టర్లు, రాజకీయ నేతలు షెడ్లు వేసి, వెంచర్లు చేసి ల్యాండ్ పార్సిల్స్ గా విక్రయించేందుకు యత్నించినట్లు గుర్తించామని, వీరందరిపై చట్టరీత్యా చర్యలుంటాయని హైడ్రా స్పష్టం చేసింది. పేదలను మోసం చేసిన వారెంతటి వారైనా చర్యలు తప్పవని హైడ్రా పేర్కొంది.
ఆకలవుతుంది.. పొద్దుటి నుంచి ఏమీ తినలేదు
తాత్కాలిక నివాసాలేర్పాటు చేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు చెందిన కొందరు చిన్నారుల ఘటన స్థలంలో తమకు ఆకలవుతుందని, పొద్దుటి నుంచి ఏమీ తినలేదని వాపోయారు. తన అమ్మా, నాన్న అడ్డా కూలీలని, పొద్దున అన్నం వండుకునేందుకు బియ్యం తీయగానే, ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు సూచించటంతో అన్న వండకుండానే అమ్మా, నాన్నా అద్దె ఇల్లు వెతకటానికి వెళ్లారని ఓ చిన్నారి వాపోయాడు. కనీసం తన స్కూల్ బ్యాగ్, బుక్స్ కూడా తీసుకునే ఛాన్స్ ఇవ్వలేదని, తన బ్యాగ్ ఆ ఇంట్లోనే ఉండిపోయిందని ఆ చిన్నారి ధీనంగా వాపోయాడు.