Cattle smuggling: జోరుగా అక్రమ పశు రవాణా దందా
అధికారులకు తెలిసినా పట్టించుకోని వైనం!
అధికారికంగా జూ పార్కుకు… అనధికారికంగా కబేళాలకు
చర్లలో కొనేదెవరు?, కురవిలో దిగుమతి చేసుకునేది ఎవరు?
చర్ల నుంచి బోట్ ద్వారా పశువులు మణుగూరుకు తరలింపు
అంతా తెలిసే జరుగుతోందా?
భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ స్వేచ్ఛ: చర్ల టూ కురవి వయా భద్రాచలం.. అక్రమ పశువుల రవాణా (Cattle smuggling) ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగానికి పశువుల అక్రమ రవాణా తతంగమంతా తెలిసే జరుగుతోందని ఈ రెండు జిల్లాల ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, ఒడిశా నుంచి పశువులను జూ పార్క్ లోని జంతువులకు ఆహార నిమిత్తం రవాణా చేస్తున్నట్టు అందరినీ నమ్మించి, అధికారులను బుట్టలు వేసుకొని అక్రమ రవాణా వ్యాపారులు ఈ దందాకు పాల్పడుతున్నారని విశ్వసనీయ సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శివారు చర్ల నుంచి పశు అక్రమ రవాణా కొనసాగుతోందని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇక్కడి నుంచి కురవి సంత పేరుతో, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని కబేళాలకు అక్రమ వ్యాపారులు తరలించేందుకు ఈ దందా నడిపిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా పండుగల సీజన్‌లో అక్రమ పశువుల రవాణా ఎక్కువగా సాగుతుంది.
అధికారులకు తెలిసినా పట్టించుకోరూ..!
గత కొన్నేళ్లుగా ఛత్తీస్‌గడ్ రాష్ట్రం, ఒడిశాల నుంచి, తెలంగాణలోని చర్ల నుంచి కురవి సంతకి పశువులను తరలించి అక్రమ పశువుల రవాణా సాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు రవాణా విషయంపై సమాచారం అందడం లేదా…? అందితే ఎందుకు దాడులు చేయడం లేదు?, ఈ అక్రమ పశువుల రవాణా యథాతథంగా సాగడానికి కారణాలేంటి?, ఈ అక్రమ రవాణాను బట్టి చూస్తే నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందా? అనే కోణంలో ప్రజలు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొన్నది.
Read Also- Cattle smuggling: చర్ల టు కురవి వయా భద్రాచలం.. ఎన్నో ఏళ్లుగా అక్రమంగా పశు రవాణా
అఫీషియల్‌గా జూ పార్కుకు
తెలంగాణ రాష్ట్రంలో కురవి సంత కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన గోవులను అఫీషియల్‌గా జూపార్క్ పేరిట హైదరాబాద్‌కు తరలిస్తున్నామంటూ చెబుతున్నారు. కానీ, నాన్ అఫీషియల్‌గా కబేళాలకు తరలిస్తున్నారనేది ఈ రెండు జిల్లాల్లోని ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. వ్యవసాయానికి పనికిరాని, పాలు ఇవ్వని, పూర్తిగా నడవలేని పశువులను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు కావాల్సిన పశువుల రవాణాకు సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ల ద్వారా సర్టిఫికెట్ పొంది, అదేవిధంగా పశువుల రవాణాకు వినియోగించే వాహనాన్ని సైతం జిల్లా రవాణా శాఖ ద్వారా అనుమతులు పొందిన అనంతరం రవాణా చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ జరిగేది మాత్రం ఆ నిబంధనలకు పూర్తి వ్యతిరేకమని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంత జరిగినా అక్రమ పశువుల రవాణా ఎందుకు ఆగడం లేదనేది చర్చనీయాంశమైంది. నిఘా వ్యవస్థ పూర్తిగా పని చేయకపోవడం అయినా కావాలి, లేదంటే తెలిసినా తెలియనట్టు ఊరుకోవడం అయినా కావాలనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే అక్రమ పశువుల రవాణా సానుకూలంగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Ind Vs Pak: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌తో జత కలిసిన అనూహ్య వ్యక్తి.. నవ్వుకుంటున్న ఇండియన్స్
కురవిలో దిగుమతి చేసుకునేది ఎవరు?
చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం శివారు మండలం చర్లలో అక్రమ పశువులను దిగుమతి చేసుకునేది ఎవరు?, అక్కడి నుంచి కురవి సంత పేరిట అక్రమ పశువుల రవాణా సాగిస్తున్నదెవరు? ఇంతకాలంలో అధికారుల దృష్టికి వెళ్లకుండానే ఉందా? అంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులకు తెలిసే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత తెలిసినా అధికారులు అక్రమ పశువుల రవాణాకు సంబంధించిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనది ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ పశువుల రవాణాను ఎందుకు అరికట్టడం లేదు?, ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటిది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చర్ల నుంచి మణుగూరుకు పశువులు
చర్ల మండలం పెద్దపల్లి నుండి పశువులను గోదావరి నదిని దాటించేందుకు బోటును అక్రమ వ్యాపారులు వినియోగిస్తున్నారు. అక్కడ నుంచి బోటు లో పశువులను తీసుకొచ్చి మణుగూరు మండలం మల్లేపల్లి గ్రామం వద్ద దింపుతారు. అదే ప్రాంతం నుంచి రెండు టాప్లెస్ ఐచర్ వాహనాలలో.. ఒక్కో వాహనానికి 50 నుంచి 70 పశువులను కుక్కి కురవి సంతకు తరలించేందుకు సిద్ధంగా వాహనాలు ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. గత రెండు రోజులుగా ఒడిస్సా ప్రాంతం నుంచి పూర్తి ఆరోగ్యకరమైన పశువులను తీసుకొచ్చి బేరమాడి ఆదివారం రాత్రి బోటు ఎక్కించేందుకు సిద్ధంగా ఉంచారని విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్. పోలీస్ శాఖ, అటవీశాఖ, రవాణా శాఖల ద్వారా ఏర్పాటుచేసిన చెక్ పోస్టుల వద్ద అక్రమంగా పశువులను తరలిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. అంటే అంతా తెలిసి అధికారులు మిన్నకుండడంతోనే ఈ అక్రమ రవాణాకు రెక్కలు వస్తున్నాయి.