Hydraa: నగరంలో ఎలా వీలైతే అలా కబ్జాలకు పాల్పడుతున్నట్లు హైడ్రా గుర్తించింది. డెడ్ ఎండ్ కాలనీ అయితే ఆ మార్గాన్ని కబ్జా చేయడం, పాత లే ఔట్‌లలో హద్దులు చెరిపేసి పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమించటం వంటివి తరుచుూ జరుగుతున్నట్లు హైడ్రా నిర్థారించింది. ఇలా అనేక ఫిర్యాదులు నగరం నలుమూలల నుంచి హైడ్రాకు అందుతున్నాయి. ఆఖరుకు ఆలయాలకు ఉద్దేశించిన స్థలాలు, పుణ్య స్నానాలు ఆచరించడానికి ఉద్దేశించిన కోనేరును కూడా కబ్జా చేసేస్తున్నారంటూ జగద్గిరిగుట్టలోని శ్రీ గోవిందరాజు స్వామి దేవస్థానం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి ఎల్లమ్మబండ వద్ద ఉన్న ఎల్లమ్మకుంటలోకి ప్రగతినగర్ మురుగంతా వచ్చి చేరుతోందని కాలువ మళ్లింపు పనులు త్వరగా జరిగేలా చూడడంతో పాటు కుంట ఆక్రమణలను కూడా తొలగించాలని అక్కడి నివాసితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. శంషాబాద్ విలేజ్, ఆర్ ఆర్ నగర్ అయ్యప్ప కాలనీలోని సర్వే నంబరు 748, 749లో పార్కుతో పాటు ప్రజావసరాలకు కేటాయించిన 4794 గజాల స్థలం కబ్జాకు గురైందని అక్కడి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇలా నగరం నలుమూలల నుంచి సోమవారం ప్రజావాణికి మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. వీటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
ఫిర్యాదులిలా..
ప్రగతినగర్ చెరువు సరిహద్దులను అధికారికంగా సర్వే చేసి నిర్ధారించాలని ప్రగతినగర్ లేక్‌వ్యూ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాను కోరారు. ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు వచ్చి సర్వేలు చేసి ఇష్టానుసారం హద్దులు నిర్ధారిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే మాపై కేసులు నమోదు చేశారంటూ వాపోయారు. ఆ సరిహద్దుల్లోకి ప్రవేశించినా తమపై కేసులు పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైడ్రా చొరవ తీసుకుని హద్దులు నిర్ధారిస్తే స్థానికంగా ఎలాంటి వివాదాలు తలెత్తవని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి మండలం సిలికాన్ కంట్రీలో 162 ప్లాట్లున్నాయి. ఇక్కడ 24 అడుగుల దారిని కూడా వదలకుండా దుకాణాలకు అక్కడ బిల్డర్లు అనుమతులివ్వడంతో ఆ దారి 16 అడుగులకు కుదించుకుపోయిందని సిలికాన్ కంట్రీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
Also Read: Harish Rao: రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్
నిర్మాణ సంస్థపై ఫిర్యాదు
అంతేగాక, ఇక్కడ క్లబ్ హౌజ్ నిర్మించి తమ అపార్టుమెంట్‌కు సంబంధించిన స్థలంతో పాటు ప్రభుత్వ స్థలాన్ని3320 గజాలలను కబ్జా చేశారని నిర్మాణ సంస్థపై ఫిర్యాదు చేశారు. అంబర్‌పేట, గోల్నాకలోని శ్రీ వేంకటేశ్వర నగర్ బస్తీలో రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ వెళ్లడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారని, అక్కడ నివాస ప్రాంతాల్లో అనుమతి లేని వ్యాపారాలు చేసి నివాసితులకు ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా రహదారిపై వేసిన బారికేడ్లను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ అల్వాల్ జొన్నబండ గ్రామం సర్వే నంబరు 21పీ, 576పీ, 577 లో 9.61 ఎకరాల మేర గంగా అవెన్యూ లో 2292 గజాల స్థలాన్ని పార్కుతో పాటు ప్రజావసరాలకు కేటాయించారు. అక్కడ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. వెంటనే ఫెన్సింగ్ వేసి ఆ స్థలాన్ని కాపాడాలని ప్రజావాణి ఫిర్యాదులో అక్కడి నివాసితులు కోరారు. లేని పక్షంలో మరోసారి కబ్జాకు గురయ్యే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పార్కుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అదే ప్రాంతంలోని అరవింద్ ఎన్‌క్లేవ్ కు వెళ్లే దారి నెంబరు 4 ను అక్రమంగా కబ్జా చేసి అడ్డుగా గోడను నిర్మించారని వెంటనే తొలగించాలని కోరారు.
Also Read: Bandi Sanjay: యువత రాజకీయాల్లోకి రావాలి… కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు
