Hyderabad Rains: హైదరాబాద్ లో గురువారం సాయంత్ర భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. మేఘానికి చిల్లు పడిందేమో అన్నట్లుగా ఒక్కసారిగా కుండపోత వర్షం నగరంపై విరుచుకుపడింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై నీరు చేరడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు. అయితే ఇది జరిగి 24 గంటలు గడవకముందే వాతావరణ శాఖ హైదరాబాద్ కు మరో వార్నింగ్ ఇచ్చింది.
వచ్చే 2 గంట్లలో భారీ వర్షం..
రానున్న రెండు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెడ్రా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షానంతర చర్యలు వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం.. నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. టోలిచౌకీ ఎక్స్ రోడ్, హకీంపేట్ కేజీఎన్ నల్లా, మోతి దర్వాజా, అహ్మద్ కాలనీ, లంగర్‌హౌస్ హుడా చెరువు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ట్రాఫిక్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్‌తో కలిసి మల్కం చెరువును పరిశీలించి చెరువు నీటి మట్టాలు, ట్రాఫిక్ పరిస్థితులను సమీక్షించారు. వర్షానంతర చర్యల్లో భాగంగా రోడ్లపై నిలిచిన నీటిని త్వరితగతిన తొలగించాలని సూచించారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
Also Read: Wedding Dates: వచ్చే 3 నెలల్లో పెళ్లి ముహూర్తాలు.. కాదు కాదు చావుకే అంటోన్న నెటిజన్లు!
ప్రజలకు విజ్ఞప్తి..
ఈ పర్యటనలో జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌ను సైతం కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ శుక్రవారం సందర్శించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై ఓఎస్‌డీ అనురాధను ప్రశ్నించారు. వర్ష సంబంధిత ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంతో పాటు, ఫీల్డ్ టీంలకు త్వరగా తెలియజేయాలనీ కమిషనర్ ఆదేశించారు. రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జీహెచ్ఎంసి హెల్ప్‌లైన్ 040-21111111 కి తెలియజేయాలని కోరారు.