Cyber Fraud: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ కొందరు అమాయకులు కేటుగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తాజాగా ముంబయికు చెందిన ఓ వృద్ధుడ్ని టార్గెట్ చేసిన సైబర్ నేరస్థులు.. అతడి నుంచి ఏకంగా రూ.9 కోట్లు కాజేశారు. ప్రేమ సానుభూతిని ఎరగా వేసి అతడ్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాటు విడతల వారిగా వృద్ధుడి నుంచి డబ్బును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా నలుగురు మహిళలు చేసినట్లు బాధితుడి కుటుంబం ఆరోపించింది.
అసలేం జరిగిందంటే?
2023 ఏప్రిల్‌లో బాధిత వృద్ధుడు ‘శర్వి’ అనే మహిళకు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. అతడితో పరిచయం లేకపోవడంతో శర్వి అతడి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అదే శర్వి అకౌంట్ పేరుతో ఆయనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈసారి ఆయన అంగీకరించాడు. అనంతరం ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. ఫోన్ నంబర్లు సైతం మార్చుకున్నారు. ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌కి చాట్ మారింది. తాను భర్త నుంచి విడిపోయి పిల్లలతో ఉంటున్నట్లు శర్వి అతడికి చెప్పింది. పిల్లలు అనారోగ్యంగా ఉన్నారని చెబుతూ డబ్బు అడగడం మొదలుపెట్టింది.
బెదిరించి డబ్బు వసూలు
కొద్ది రోజుల తర్వాత ‘కవిత’ అనే మరో మహిళ వాట్సాప్‌లో వృద్ధుడికి మెసేజ్ చేయడం ప్రారంభించింది. తనకు శర్వి బాగా తెలుసని చెప్పి.. తనతోనూ స్నేహం చేయమని వృద్ధుడ్ని కోరింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కూడా కొద్దికాలం చాటింగ్ జరిగింది. ఆ తర్వాత నుంచి అసభ్యకరంగా సందేశాలు పంపుతూ.. వృద్ధుడి నుంచి ఆమె డబ్బు డిమాండ్ చేయడం మెుదలుపెట్టింది. అదే ఏడాది డిసెంబర్ లో దీనాజ్ అనే మహిళ నుండి బాధుతుడికి మెసేజెస్ రావడం మెుదలయ్యాయి. తాను శర్వి చెల్లినని చెబుతూ.. తన అక్క మరణించినట్లు పేర్కొంది. ఆస్పత్రి బిల్లు చెల్లించమని కోరింది. గతంలో శర్వి, వృద్ధుడు మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్లు పంపి బెదిరిస్తూ పలుమార్లు డబ్బు తీసుకుంది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ దశలో వృద్ధుడు రివర్స్ కావడంతో.. తాను ఆత్మహత్య చేసుకుంటానని దీనాజ్ బెదిరించింది.
Also Read: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్‌లో తొలి బాధితుడ్ని నేనే.. ప్రూఫ్స్‌తో సహా బయటపెడతా.. బండి సంజయ్
734 లావాదేవీలు.. రూ.8.7 కోట్లు
అది జరిగిన కొద్ది రోజులకే ‘జాస్మిన్’ అనే మరో మహిళ.. తాను దీనాజ్ స్నేహితురాలినని చెప్పి వృద్ధుడికి పరిచయమైంది. వృద్ధుడు ఆమెకు కూడా డబ్బు పంపాడు. అలా 2023 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య మెుత్తం రూ.8.7 కోట్లు ఆ నలుగురి మహిళలకు పంపాడు. వారి మధ్య ఏకంగా 734 లావాదేవీలు జరిగాయి. తన పొదుపు మెుత్తాన్ని వారికి ఇచ్చేయడంతో పాటు.. అది సరిపోక కోడలి నుంచి రూ.2 లక్షలు సైతం అప్పుగా వృద్ధుడు తీసుకోవడం గమనార్హం. దీంతో కుమారుడికి అనుమానం వచ్చి ప్రశ్నించగా.. జరిగినదంతా వృద్ధుడు చెప్పేశాడు. సైబర్ మోసానికి గురయ్యావని కుమారుడు చెప్పడంతో షాక్ లో ఆస్పత్రిపాలయ్యాడు. దీంతో తన తండ్రి మోసపోయిన విషయం గురించి కుమారుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఇదంతా ఒక మహిళే చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.