Hyderabad Real Estate: రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ కింగ్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మార్కెట్ అంత ఊపు మీద లేదు. ఇది ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. దేశమంతా ఉన్నది. అంతర్జాతీయంగా నెలకున్న సంక్షోభం కారణంగా రియల్ ఎస్టేట్ రంగం నత్తనడకన సాగుతున్నది. అయితే, రేట్లు మాత్రం అదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీలో జరిగిన ప్లాట్ల వేలమే అందుకు నిదర్శనం.
కేపీహెచ్‌బీలో రికార్డ్ ధర
నగరంలోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) లో ఖాళీ ప్లాట్ల విక్రయం కోసం బహిరంగ వేలం నిర్వహించారు. చదరపు గజం రూ.2.98 లక్షలకు కొనుగోలు చేశారు. చదరపు గజం ధర ఇంత భారీగా పలకడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. దీంతో హౌజింగ్ బోర్డు అధికారులు హర్షం వ్యకం చేస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచి పురోభివృద్ధిలో ఉందన్న దానికి ఇదే ఉదాహరణ అని చెబుతున్నారు.
Also Read: KCR Kaleshwaram: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఏం చెబుతారో?
మొత్తం 18 స్థలాలు
కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు కాలనీ ఫేజ్ 7 లోని ఖాళీగా ఉన్న 18 స్థలాలకు స్థానిక కమ్యూనిటీ హాల్‌లో బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. 198 గజాల నుంచి 987 గజాల వరకు విస్తీర్ణం ఉన్న ప్లాట్ల విక్రయం కోసం నిర్వహించిన వేలం పాటలో, 22వ నెంబర్ ప్లాట్‌కు బిడ్డర్లు చదరపు గజానికి రూ.2.98 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చి కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ల వేలంలో మొత్తం 84 మంది పాల్గొన్నారు.
రూ.142 కోట్ల ఆదాయం
ఈ వేలం ద్వారా హౌజింగ్ బోర్డుకు సుమారు రూ.142.78 కోట్ల మేర ఆదాయం వస్తుందని వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. ఈ 18 ప్లాట్లకు సంబంధించి మొత్తం 6232 చదరపు గజాలను వేలం వేయగా సగటున ఒక్కో గజానికి రూ.2.38 లక్షలు పలకగా, 22 ప్లాట్‌కు సంబంధించి మాత్రం అత్యధికంగా రూ.2.98 లక్షల రికార్డ్ ధర పలికిందని వివరించారు. ఈ వేలంలో భూములు కొనుగోలు చేసిన వారు, రెండు రోజుల్లో నాలుగో వంతు సొమ్మును చెల్లించాల్సి ఉంది. ఈ రూపేణా హౌజింగ్ బోర్డుకు రూ.35.34 కోట్ల మేర ఆదాయం సమకూరనున్నది.
Also Read: Series of thefts: మంచితనం ముసుగులో వరుస దొంగతనాలు