Afzalgunj Shooting Case: (Hyderabad) హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అఫ్జల్‌గంజ్ (Afzalgunj) కాల్పుల కేసులో క్లూస్ ఉన్నాయని, నిందితులను గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ (Hyderabad) పోలీసు ( police) ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితం ప్రకటించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపామని వారు తెలిపారు. అయితే, ఆరు నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు నిందితులు మాత్రం పట్టుబడలేదు. దీనిపై ఓ అధికారితో మాట్లాడగా, “రెండేళ్లుగా నాలుగు రాష్ట్రాల పోలీసుల వేట కొనసాగుతుంది.. ఇప్పటివరకు నిందితులు దొరకలేదు.. మాకు కూడా పట్టుబడతారన్న నమ్మకం లేదు” అని వ్యాఖ్యానించడం గమనార్హం.
కరడుకట్టిన నేరస్తులు..
బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా ఫతేపూర్‌కు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ (Alok Kumar) కరడుకట్టిన నేరస్తులు. వీరు స్కెచ్ వేస్తే అనుకున్న పని పూర్తి చేస్తారు, అవసరమైతే అవతలివారి ప్రాణాలు కూడా తీస్తారు. 2023 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్‌లో జైసింగ్ అనే సెక్యూరిటీ గార్డును దారుణంగా హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుని ఉడాయించారు. ఆ తరువాత చాలా కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న ఈ ఇద్దరు 2025 జనవరిలో హైదరాబాద్ (Hyderabad) వచ్చారు.
(Miyapur) మియాపూర్‌లోని శ్రీసాయి గ్రాండ్ హోటల్‌లో బస చేసి కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో దోపిడీకి పథకం వేశారు. వరుసగా మూడు రోజుల పాటు చోరీ చేసిన ద్విచక్రవాహనంపై బీదర్ వెళ్లి రెక్కీ చేసిన అమన్ కుమార్, అలోక్ కుమార్, జనవరి 16న నేరానికి పాల్పడ్డారు. ఏటీఎం సెంటర్లలో డబ్బు నిల్వ చేయడానికి వచ్చిన క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ఉద్యోగి గిరి వెంకటేశ్‌ను కాల్చి చంపి, మరో ఉద్యోగి (Siva kumar) శివకుమార్‌పై కూడా కాల్పులు జరిపి రూ.93 లక్షలు దోచుకుని ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి ఉడాయించారు.
Also Read: Damodar Rajanarsimha: దేశ వ్యాప్తంగా క్యాన్సర్ సమస్య.. రోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం!
అఫ్జల్‌గంజ్ కాల్పులు..
బీదర్ నుంచి నేరుగా తాము బస చేసిన హోటల్‌కు వచ్చి గదిని ఖాళీ చేసి, నగదుతో ఉన్న బ్యాగులతో (MGBS) ఎంజీబీఎస్‌కు చేరుకున్నారు. అక్కడ పార్కింగ్‌లో బైక్‌ను పార్క్ చేసి రోషన్ ట్రావెల్స్‌కు వచ్చి రాయ్‌పూర్ వెళ్లేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు కూడా ఎక్కారు. అయితే, వీరి వ్యవహారం అనుమానాస్పదంగా అనిపించడంతో ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ బ్యాగుల్లో ఏముందో చూపించాలని అడిగాడు. దానికి అమన్ కుమార్, (Aman Kumar) అలోక్ కుమార్ అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో వాగ్వాదం మొదలు కావడం, అక్కడే ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్ విషయం ఏంటో కనుక్కుందామని వస్తుండటం గమనించిన అమన్ కుమార్, అలోక్ కుమార్ (Alok Kumar )దుస్తుల్లో నుంచి తుపాకులు బయటకు తీసి జహంగీర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి ఉడాయించారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. దాంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి తిరుపతి వెళ్లే బస్సు ఎక్కి కడపలో దిగిపోయి, అక్కడి నుంచి నెల్లూరు చేరుకున్నట్టు గుర్తించారు. నెల్లూరు నుంచి చెన్నై పారిపోయిన తరువాత రైల్లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. అక్కడి నుంచి నేపాల్ పారిపోయినట్టు గుర్తించారు.
ఆరు నెలలు గడిచినా..
ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు కాల్పులకు తెగబడ్డ అమన్ కుమార్, (Alok Kumar) (Aman Kumar) అలోక్ కుమార్‌ల గురించిన సమాచారం తమ వద్ద ఉందని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. దీని కోసం ఎంత వ్యయప్రయాసలు ఎదురైనా నిందితులను మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు. నిందితుల గురించి సమాచారం ఇస్తే ఐదు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే, ఆరు నెలలు గడిచిపోయాయి తప్ప అమన్ కుమార్, అలోక్ కుమార్ (Alok Kumar) ఇప్పటివరకు పట్టుబడలేదు.
దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఓ అధికారితో మాట్లాడగా, నిందితులను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే, ఇప్పట్లో వాళ్లు తమ చేతికి చిక్కుతారన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. అమన్ కుమార్, అలోక్ కుమార్ కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక రాష్ట్రాల పోలీసులు కూడా గాలిస్తున్నారన్నారు. ఈ ఇద్దరు ప్రస్తుతం నేపాల్‌లోనే ఉన్నట్టుగా సమాచారం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో, సంచలనం సృష్టించిన అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో మిస్టరీ ఎప్పుడు వీడుతుందో? నిందితులు ఎప్పుడు పట్టుబడతారో? అన్నది జవాబు లేని ప్రశ్నలుగానే ఉన్నాయి.
Also Read: Harish Rao: పంచాయతీ కార్యదర్శుల బిల్లులు వెంటనే చెల్లించాలి!