Hyderabad Police: భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం, వివిధ శాఖల అధికారులు సమష్టిగా రంగంలోకి దిగారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కీలకమైన కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మూడు కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రోబోటిక్ క్లీనింగ్ విధానం
వర్షాకాలంలో రోడ్లపై వాటర్ లాగింగ్ సమస్యను పరిష్కరించడానికి మలక్‌పేటలో విజయవంతమైన రోబోటిక్ క్లీనింగ్ విధానాన్ని నగరం అంతటా అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే, వాహనదారుల పార్కింగ్ కష్టాలను తీర్చేందుకు త్వరలోనే మల్టీ లెవల్ పార్కింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్ ద్వారా తమకు సమీపంలో ఎక్కడ పార్కింగ్ ఖాళీగా ఉందో వాహనదారులు మొబైల్‌లోనే చూసుకోవచ్చు.
Also Read: Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!
ట్రాఫిక్ అడ్డంకుల తొలగింపు
ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న అంశాలపై అధికారులు క్షుణ్ణంగా చర్చించారు. రోడ్డు ఇరుగ్గా ఉన్న చోట ఉన్న బస్టాప్‌లను వెడల్పుగా ఉన్న ప్రాంతాలకు తరలిస్తారు. రోడ్ల మధ్యలో ఉన్న సులాబ్ కాంప్లెక్సులను తొలగించి అనువైన చోటుకు మారుస్తారు. ఫుట్‌పాత్ ఆక్రమణలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకోనుంది. రోడ్లపై తవ్వకాలు జరిపినప్పుడు ప్యాచ్ వర్క్ ఆలస్యం కాకుండా, తవ్వకం, మరమ్మతు బాధ్యతను ఒకే కాంట్రాక్టరుకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రోడ్లు దాటే చోట ప్రమాదాలను నివారించేందుకు మరిన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ప్రతి నెలా క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా 80 శాతం సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అభిప్రాయపడ్డారు. సమస్యలను స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా విభజించి పరిష్కరిస్తామని వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలందుతాయని సజ్జనార్ స్పష్టం చేశారు.
Also Read: Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్‌ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!

