Hyderabad Police: పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి యజమానుల నమ్మకాన్ని సంపాదించుకుని, అదను చూసి దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.31 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన నగల వ్యాపారి గజవాడ శ్రీధర్ ఇంట్లో నారాయణపేట జిల్లాకు చెందిన ఊరగడ్డ మాధవి (35) పని మనిషిగా చేరింది.
24.2 తులాల బంగారాన్ని రికవరీ
నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటిస్తూ, శ్రీధర్ ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు, బిస్కెట్లను కొద్దికొద్దిగా తస్కరించింది. నగలు మాయమవుతున్న విషయాన్ని గమనించిన శ్రీధర్ ఫిర్యాదు మేరకు కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మాధవిని విచారించగా, చోరీ చేసినట్లు అంగీకరించింది. దొంగిలించిన బంగారాన్ని కరిగించి ఆభరణాలు చేయించుకున్నానని, తన భర్త ఊరగడ్డ కృష్ణయ్య (40) సహకరించాడని వెల్లడించింది. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి, వారి నుంచి 24.2 తులాల బంగారాన్ని రికవరీ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
Also Read: Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్‌ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!
బొల్లారం పరిధిలోనూ చోరీ
బొల్లారం ప్రాంతానికి చెందిన సుజాత ఇంట్లో జూలై నెలలో మచ్చబొల్లారంకు చెందిన సింధు అలియాస్ చిన్నారి పనికి చేరింది. ఇటీవల సుజాత బీరువాలో దాచిపెట్టిన నగలు కనిపించకపోవడంతో బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అనుమానంతో సింధును అదుపులోకి తీసుకుని విచారించగా, తానే నగలను అపహరించినట్లు అంగీకరించింది. ఆమె నుంచి 5.1 తులాల బంగారు నగలు, 61 తులాల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకుని, నిందితురాలిని రిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Crime: పహాడీషరీఫ్‌లో మైనర్‌పై అత్యాచారం.. బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి!

