Hyderabad Police: కనిపించకుండా పోయిన ఎస్ఐ సర్వీస్ పిస్టల్ కేసు ఈస్ట్ జోన్ పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడైన ఎస్ఐ తనకేమీ తెలియదని చెబుతుండటం, ఇప్పటికే ఆ పిస్టల్‌ను రాయలసీమ ముఠాలకు అమ్ముకున్నట్టుగా ప్రచారం జరుగుతుండటంతో, కేసులోని మిస్టరీని ఛేధించటానికి దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, చిన్నపాటి క్లూ కూడా దొరక్కపోవటంతో ఏం చేయాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. 2020వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఎస్ఐ భానుప్రకాశ్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో డీఎస్‌ఐగా పని చేసిన విషయం తెలిసిందే.
అదాలత్‌లో ఆ కేసును క్లోజ్
డ్యూటీలో ఉన్నప్పుడు తాను గ్రూప్1, గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పి భాను తరచూ సెలవులు పెడుతూ వచ్చాడు. ఆ సమయంలోనే ఆన్‌లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో దాదాపు రూ.80 లక్షలు పోగొట్టుకున్న భాను పలువురి నుంచి అప్పులు చేసినట్టుగా సమాచారం. వీటి నుంచి బయటపడటానికి తన పోస్టును అడ్డుపెట్టుకుని ఓ చోరీ కేసులో రికవరీ చేసిన 4 తులాల బంగారాన్ని బాధితులకు తిరిగి ఇవ్వలేదు. త్వరలోనే ఇస్తానని నమ్మించి లోక్ అదాలత్‌లో ఆ కేసును క్లోజ్ చేయించాడు. ఆ తరువాత స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నాడు.
Also Read: Hyderabad Police: సిమెంట్ బస్తాల ముసుగులో.. రూ.6.25 కోట్ల గంజాయి రవాణా ఎక్కడ పట్టుకున్నారంటే?
గ్రూప్ 2 వచ్చిందంటూ వచ్చి
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతకాలం క్రితం జరిగిన గ్రూప్2 పరీక్ష రాశాడు. గత నెల చివరి వారంలో తాను పని చేసిన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనకు గ్రూప్ 2 ఉద్యోగం వచ్చిందని సిబ్బందితో చెప్పాడు. ఏపీకి వెళ్లిపోతున్న నేపథ్యంలో స్టేషన్‌లో పెట్టిన తన వస్తువులను తీసుకెళ్లటానికి వచ్చానన్నాడు. ఆ తరువాత సీఐ వద్దకు వచ్చిన భాను తన డ్రాలో పెట్టిన 9ఎంఎం పిస్టల్ కనిపించటం లేదని చెప్పి, సీసీ కెమెరాల ఫుటేజీని చూడాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఆయనకు చెందిన డ్రాను తనిఖీ చేయగా అందులో బుల్లెట్లు మాత్రమే దొరికాయి, రివాల్వర్ కనిపించలేదు. సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించినా పిస్టల్‌ను ఎవరు తీసుకెళ్లారన్నది బయటపడలేదు.
ఆ ప్రాంత ముఠాల వద్ద తాకట్టు
అయితే, అదే డ్రా నుంచి రికవరీ చేసిన 4 తులాల బంగారాన్ని భాను తీసుకెళ్లినట్టుగా నిర్ధారణ అయ్యింది. పై అధికారులు నిలదీయగా బంగారాన్ని తానే తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నానని చెప్పిన భాను పిస్టల్ విషయం మాత్రం తెలియదన్నాడు. భాను రాయలసీమ వాసి కావటంతో, బెట్టింగుల్లో లక్షలు పోగొట్టుకుని అప్పులపాలై పిస్టల్‌ను ఆ ప్రాంత ముఠాల వద్ద తాకట్టు పెట్టినట్టుగా ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇటు ఈస్ట్ జోన్ పోలీసులతో పాటు అటు టాస్క్ఫోర్స్అధికారులు కూడా విచారణ చేశారు. అయితే, ఎన్ని రకాలుగా ప్రశ్నించినా భాను పిస్టల్ గురించి తనకు తెలియదని మాత్రమే సమాధానమిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో కేసులోని మిస్టరీని ఛేదించి, పిస్టల్‌ను ఎలా రికవరీ చేయాలన్నది అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నట్టుగా తెలిసింది.

