Hyderabad Police: మహిళలు, యువతులను వేధిస్తున్న జులాయిల ఆట కట్టించేందుకు సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది గడిచిన ఒక్క వారంలోనే 142 డెకాయ్ ఆపరేషన్లు జరిపింది. ఈ క్రమంలో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 76 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాపులు, కాలేజీలు, స్కూళ్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, మెట్రో స్టేషన్లలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం వీరి ఆట కట్టించేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. సివిల్ దుస్తుల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించిన షీ టీమ్స్ పోలీసులు 76 మంది జులాయిలను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వీరిలో 51 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, మిగితా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతూ కాపురాలను నరకం చేసుకున్న 29 జంటలకు కూడా షీ టీమ్స్ సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి సమస్యలు సావధానంగా తెలుసుకుని రాజీ కుదిర్చారు. అంతేకాకుండా, రాత్రి కాగానే రోడ్ల మీదకు వస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 9 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి, వారిలో ముగ్గురిని రెస్క్యూ హోంకు తరలించారు. మరోవైపు, కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల భద్రత కోసం ఉన్న చట్టాలు, వారి హక్కులపై అవగాహన కల్పించారు. వీటిల్లో 223 మంది మహిళలు పాల్గొన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా మహిళలు ఉమెన్ హెల్ప్‌లైన్ నెంబర్ 181కి ఫోన్ చేయాలని డీసీపీ సృజన సూచించారు. చిన్నపిల్లల వేధింపులపై 1098కు, అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్‌కు, సైబర్ నేరాల బారిన పడ్డవారు 1930 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
