Hydra: మూసీ నది వరద ప్రవాహాం ముంచెత్తిన ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో హైడ్రా (Hydra) కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చాదర్ ఘాట్, మూసారంబాగ్, ఎంజీ బీ ఎస్, నార్సింగి ప్రాంతాల్లో వరద ఉధృతిని పరిశీలించి , విధి నిర్వహణలో ఉన్న బృందాలకు దిశా నిర్దేశం చేశారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసీ నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను పరిశీలించారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు. అక్కడ వరదలో చిక్కుకుని భవనాలపై ఉన్నవాళ్ళకి డ్రోన్స్ ద్వారా ఆహారం అందించడాన్ని పరిశీలించారు. గోడలు పూర్తిగా నీటమునిగాయని, కూలే ప్రమాదం ఉంటుందని ఖాళీ చేయాలని హెచ్చరించారు.
Also Read: Varalaxmi Sarathkumar: తన సోదరి పూజా శరత్ కుమార్‌తో వరలక్ష్మి చేస్తున్న చిత్రానికి టైటిల్ ఫిక్స్!
అయినా కొంతమంది అక్కడి నుంచి ఖాళీ చేసే పరిస్థితి కనిపించలేదు. ఎంజీబీ ఎస్ వద్ద మూసీ నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలకి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అర్ధ రాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద వచ్చినప్పుడు చేపట్టిన సహాయక చర్యలను కమిషనర్ అభినందించారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది సురక్షితం
వందలాది మంది ప్రయాణికులను సురక్షితంగా హైడ్రా డీఆర్ఎఫ్, పోలీస్, ఆర్టీసీ, జీహెచ్ఎంసీ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. మూసీ వరదల దృష్ట్యా పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ సూచించారు. ఎన్ డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని వివరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నార్సింగి ప్రాంతంలో ఔటర్ మీద నుంచి గండిపేట నుంచి వస్తున్న వరద ఉధృతిని హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అక్కడ సర్వీస్ రోడ్ల మీదుగా వరద ప్రవహించడాన్ని గమనించి, ఎవరు కూడా పొరపాటున ఆ మార్గంలో వెళ్లకుండా కాపలా ఏర్పాటు చేయాలని సూచించారు.
నలుగురిని కాపాడిన హైడ్రా
నార్సింగి – మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు సమయస్పూర్తిగా వ్యవహారించి రాత్రి కాపాడాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట) గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద పారుతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ఓ డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పుడు ఆటో ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది గమనించి వాళ్ళని సురక్షితంగా కాపాడి వాళ్లను ఒడ్డుకు చేర్చారు. ఆటో ట్రాలీ కి తాడు కట్టి డీఆర్ఎఫ్ వెహికల్తో బయటకు లాగారు.
Also Read: MP Kadiyam Kavya: అభివృద్ధి పనులకు నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ కడియం కావ్య