Local body election Results: కౌన్ బనేగా జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఉన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ నెల 23న నిర్వహించిన పోలింగ్ లో పోలైన ఓట్లను ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించే ప్రక్రియను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో చేపట్టనున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఆఫీసు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 112 మంది ఓటర్లున్న లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికలో 88 ఓట్లు పోలైనట్లు అధికారులు వెల్లడించారు.
ఓటు హక్కు కల్కి ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యులకు పోలింగ్ బూత్ నెం.1, అలాగే కార్పొరేటర్లకు పోలింగ్ బూత్ నెం.2లను ఏర్పాటు చేసి, బ్యాలెట్ పేపర్ తో ఈ ఎన్నికను అధికారులు నిర్వహించగా, ఈ ఓటింగ్ కు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకున్న ఓట్లు మినహా కాంగ్రేస్ 14 ఓట్లు, ఎంఐఎం 49 ఓట్లు, అలాగే బీజేపీ 25 ఓట్లతో మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ మాధిరిగానే కౌంటింగ్ కు కూడా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో సెక్షన్ 144 తో పాటు వంద మీటర్ల ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ గ్రౌండ్ ఫ్లోర్ లోని ట్రెజరీ హాల్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లను అధికారులు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పన్వర్ హాల్ కౌంటింగ్ కేంద్రానికి తీసుకురానున్నారు. ఓట్లు తక్కువగానే ఉండటంతో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టిన సుమారు నాలుగు నుంచి అయిదు గంటల వ్యవధిలోనే ఫలితాన్ని వెల్లడించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రాధాన్యత క్రమం ప్రాతిపదికన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి, అబ్జర్వర్ సురేంద్రమోహన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ జరిగిన ఈ నెల 23వ తేదీ తెల్లవారుఝము నుంచి మోహరించిన పోలీసుల పహారా కౌంటింగ్ ముగిసిన, ఫలితాన్ని వెల్లడించే వరకు కొనసాగనుంది.
AlSO Read: Jogulamba Temple: అవినీతిపై కఠినంగా దేవాదాయ శాఖ.. జోగులాంబ ఆలయ ఆర్చకుడిపై చర్యలు!
ఎంఐఎంకే గెలుపు అవకాశాలు?
లోకల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు పోల్ కాగా, వాటిలో సింహాభాగం ఓట్లు 49 ఎంఐఎం పార్టీకి చెందినవే. దీనికి తోడు 14 ఓట్లున్న కాంగ్రేస్ కూడా మజ్లీస్ కు మద్దతుగా ఓటింగ్ చేయాలని నిర్ణయించటంతో గెలుపునకు కావల్సిన 45 ఓట్ల కన్నా ఎక్కువ ట ఓట్లు సింగిల్ పార్టీగా ఎంఐఎంకే ఉన్నందున ఆ పార్టే గెలిచే అవకాశాలెక్కువగా ఉన్నాయి. మొత్తం 63 ఓట్లు మజ్లీస్ పక్షాన ఉండగా, కేవలం 25 ఓట్లు మాత్రమే ఉన్న బీజేపీ చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ ఓటర్లు వస్తారని ఎదురుచూసినా, ఫలితం దక్కలేదు.
పైగా కాంగ్రేస్ ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయని, అందులో కొన్ని ఓట్లు తమకు అనుకూలంగా పోల్ అయ్యాయని, బీజేపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ గౌతంరావు వ్యాఖ్యానించారు. ఒక వేళ మొత్తం కాంగ్రేస్ ఓట్లన్నీ క్రాస్ ఓటింగ్ అయినా, అభ్యర్థి చెప్పిన విధంగా బీజేపీకి అనుకూలంగా పడినా గెలిచేందుకు అవసరమైన 45 మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చేరుకునే అవకాశం లేని పక్షంలో ఎంఐఎం విజయం లాంఛనమే అయినా, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు