Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోను నడపలేమంటూ నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ కేంద్రానికి తేల్చిచెప్పింది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన నగరంలోని మూడు మెట్రో కారిడార్ లను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అంతేకాదు మెట్రో నిర్వహణ వల్ల కలుగుతున్న నష్టాలను వివరిస్తూ కేంద్రానికి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది.
‘టికెట్ల ఆదాయం సరిపోవట్లేదు’
మెట్రో నిర్వహణ భారమవుతుందని కేంద్రానికి ఎల్&టి సంస్థ లేఖ రాసింది. మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయాలని లేఖలో కోరింది. వరుస నష్టాలు, పేరుకు పోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపలేమని ఎల్ అండ్ టీ తేల్చి చెప్పింది. ప్రతి రోజు 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నామని.. అయినప్పటికీ టికెట్ల రూపంలో వచ్చే ఆదాయం సరిపోవట్లేదని లేఖలో వాపోయింది. ప్రకటనలు, స్థలాల లీజులు, షాపులు ద్వారా కొంతమేర ఆదాయం వస్తున్నప్పటికీ.. నిర్వహణ ఖర్చులు, విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీత భత్యాలు భారంగా మారుతున్నాయని తెలిపింది.
Also Read: Kishkindhapuri Movie Review: కిష్కింధపురి సినిమా రివ్యూ..
బకాయిలు రూ.5,000 కోట్ల పైనే
ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తమను తీవ్రమైన నష్టాల్లోకి ముంచెత్తిందని ఎల్ అండ్ టీ కేంద్రానికి తెలియజేసింది. అంతేకాకుండా 2020 నాటికి రాష్ట్రపతి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.5000 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్లు ఎల్ అండ్ టీ పేర్కొంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్‌లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలకపోవడం వంటి కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు ఎల్‌అండ్‌టీ వెల్లడించింది. అవసరమైతే మెట్రో మొదటి దశలోని ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
Also Read: CP Radhakrishnan: కొత్త ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
మెట్రోను విస్తరించేందుకు సన్నాహాలు
మరోవైపు హైదరాబాద్ లో మెట్రోను మరింత విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం మెట్రో రెండో దశ ప్రతిపాదనలు కేంద్రానికి సైతం పంపింది. ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, నాగోల్–ఎల్‌బీనగర్–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎల్‌బీనగర్–హయత్‌నగర్, రాయదుర్గం–అమెరికన్ కాన్సులేట్–హైకోర్టు భవనం, మియాపూర్–బీహెచ్‌ఈఎల్ తదితర మార్గాల్లో ‘ఏ’ విభాగం కింద మొత్తం 5 కారిడార్‌లలో 76.5 కి.మీ. మేర మెట్రో సేవలను పొడగించాలని ప్రభుత్వం సూచించింది.