CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాధాకృష్ణన్ చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్ కర్, వెంకయ్య నాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు తదితర ఎన్డీఏ కూటమి నేతలు హాజరయ్యారు.
452 ఎంపీల మద్దతుతో..
ఎన్డీఏ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్.. సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు. 452 ఓట్లు పొంది ప్రతిపక్ష అభ్యర్థి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి (300 ఓట్లు)ని ఓడించారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోదీ తెలిపిన ప్రకారం.. 781 మంది ఎంపీలలో 767 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 98.2%గా నమోదైంది. అందులో 752 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 15 ఓట్లు చెల్లనివిగా తేలాయి. దాంతో గెలుపునకు కావాల్సిన కనీస మెజారిటీ (ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు) 377గా నిర్ణయించబడింది.
#WATCH || 𝐂𝐏 𝐑𝐚𝐝𝐡𝐚𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐧 (@CPRGuv) 𝐭𝐚𝐤𝐞𝐬 𝐨𝐚𝐭𝐡 𝐚𝐬 𝐭𝐡𝐞 𝟏𝟓𝐭𝐡 𝐕𝐢𝐜𝐞 𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚.
#VicePresident #CPRadhakrishnan pic.twitter.com/wn9btutr11
— All India Radio News (@airnewsalerts) September 12, 2025
విపక్షాల నుంచి క్రాస్ ఓటింగ్..
ఎన్డీఏకు సహజంగానే 427 మంది ఎంపీల మద్దతు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు కూడా రాధాకృష్ణన్‌కు ఓటేశారు. మరో ముగ్గురు ఎంపీలు రహస్యాంగా పీసీ రాధాకృష్ణన్ కు మద్దతు తెలిపారు. దీంతో ఆశించిన దానికంటే 14 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయి. దీంతో ప్రతిపక్షం వైపు నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్టుగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రధాని మోదీ ఏమన్నారంటే?
ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సీపీ రాధాకృష్ణన్‌ను అభినందించారు. ఆయన రాజ్యాంగ విలువలను బలోపేతం చేస్తారని, పార్లమెంటరీ చర్చలకు మరింత ప్రాముఖ్యతను తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు. ‘2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ కి అభినందనలు. ఆయన జీవితం ఎల్లప్పుడూ సమాజ సేవకు, పేదలు, బలహీన వర్గాలను శక్తివంతం చేయడానికి అంకితం అయింది. రాజ్యాంగ విలువలను బలపరిచే అద్భుతమైన ఉపరాష్ట్రపతిగా ఆయన నిలుస్తారని నమ్ముతున్నాను’ అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
జగదీప్ ధన్ కర్ రాజీనామాతో..
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ తన పదవీ కాలం ముగియడానికి రెండున్నరేళ్లు ఉండగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జులై 21న ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. 2027 ఆగస్టు 10 వరకు పదవి కాలం ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ధన్ కర్ స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో తలెత్తిన విభేదాల వల్లే ధన్ కర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
Also Read: Mirai Movie Review: మిరాయ్ సినిమా రివ్యూ.. తేజ సజ్జా హిట్ కొట్టాడా?
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. నామినేటెడ్ సభ్యులకు సైతం ఓటు ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే హక్కు ఉంటుంది. అత్యధిక మంది ఎంపీల మద్దతు చొరగొన్న అభ్యర్థిని ఉపరాష్ట్రపతిగా రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68, క్లాజ్ 2 ప్రకారం.. ఉపరాష్ట్రపతి మరణం, రాజీనామా, తొలగింపు లేదా ఇతర కారణాలతో పదవి ఖాళీ అయినప్పుడు వీలైనంత త్వరగా ఎన్నిక జరగాలి. ఎన్నికైన వ్యక్తి తన పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి పూర్తి ఐదు సంవత్సరాల కాలపరిమితికి పదవిలో కొనసాగుతారు.