Hyderabad Water Board: గ్రేటర్ హైదరాబాద్ మహానగరవాసుల దాహర్తిని తీర్చేందుకు వందల కిలోమీటర్ల దూరం నుంచి నీటిని సిటీకి తీసుకువచ్చి, శుద్ది చేసే తాగునీటిగా సరఫరా చేస్తున్నామని, ఈ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే జరిమాన తప్పదని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి(Ashok Reddy,) అల్టిమేటమ్ జారీ చేశారు. అంతేగాక, నగరంలోని జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ ప్రధాన రహదారిపై వెళుతుండగా రోడ్ నెంబర్ 12 లో నీరు లీకేజి అయినట్టు ఎండీ గమనించి, స్థానిక మేనేజర్ ను లీకేజికి కారణాలు ఆరా తీశారు. దీంతో ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించారు.
అయితే దగ్గరికి వెళ్లి చూసే సరికి ఓ వ్యక్తి జలమండలి సరఫరా చేసే నీటితో కార్, బైక్ కడిగటాన్ని గుర్తించారు. ఇదే విషయం ఎండీకి విన్నవించగా, ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించవద్దని చెప్పారు. అంతే కాకుండా అతనికి నోటీసు అందించి, జరిమానా వెయ్యాలని సంబంధిత మేనేజర్ ను ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి అధికారులు రూ. పది వేలు జరిమానాగా విధించారు. అలాగే, ఆ ప్రాంతంలోనే ఓ వాటర్ సంపు నిండి ఓవర్ ఫ్లో అయి, దాదాపు ఒక కిలో మీటర్ వరకు తాగునీరు రహదారిపై ప్రవహించటాన్ని గుర్తించిన అధికారులు బాధ్యుడికి రూ.5 వేల జరిమానా విధించారు. జలమండలి సరఫరా చేసే తాగునీరు ఇలా ఇతర అవసరాలకు వినియోగించొద్దని ఎండీ సూచించారు. ఎవరైనా వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు.
Also Read: Mahabubabad District: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించొద్దని ఎల్‌హెచ్‌పీఎస్ డిమాండ్
జూబ్లీ హిల్స్ ఎండీ పర్యటన
జలమండలి ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ డివిజన్ -6 పరిధిలోని జూబ్లీ హిల్స్ పరిధిలోని వెంకటగిరి, కృష్ణ నగర్ కాలనీ, శ్రీనగర్ కాలనీలలోని పలు సమస్యాత్మకమైన ప్రాంతాలను ఎండీ అశోక్ రెడ్డి బుధవారం పరిశీలించారు. మొదటగా వెంకటగిరి ప్రాంతంలో వర్షం పడినపుడు అవుట్ లెట్ సరిగ్గా లేని కారణంగా వర్షం నీరు కాలనీలో నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీంతో జలమండలి ఇటీవల వర్షాల తరువాత డీ-సిల్టింగ్ పనులు చేపట్టింది. ఎండీ అశోక్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి డీ-సిల్టింగ్ పనులు పరిశీలించారు. ఏళ్లనాటి సీవరేజ్ లైన్లు, రోడ్డు కింద పూడ్చుకుపోయినట్టు, దీంతో మట్టి, చెత్త చేరి సీవరేజ్ సాఫీగా చేరకుండా వీధుల్లో ఓవర్ ఫ్లో అవుతున్నట్టు అధికారులు ఎండీకి వివరించారు.
నిర్మాణం చేపట్టాలి
దీంతో ఈ ప్రాంతంలో సీవరేజ్ లైన్లను డీ-సిల్టింగ్ చేసి తాత్కాలిక పరిష్కారాన్ని సమకూర్చాలని ఆదేశించారు. శాశ్వత పరిష్కారంగా మ్యాన్ హాళ్లను రోడ్డుకు సమాంతరంగా పునర్నిర్మాణం చేయాలని ఆదేశిచారు. ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు. అలాగే, జీహెచ్ఎంసీ(ghmc) సంబంధించిన వాననీటి కాలువలో సీవరేజ్ నీరు చేరకుండా ప్రత్యేక సీవరేజ్ పైప్ లైన్లను నిర్మాణం చేపట్టాలని ఎండీ అశోక్ రెడీ అధికారులను ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలి
జీహెచ్ఎంసీ(ghmc) వాననీటి కాలువలో డీ-సిల్టింగ్ పనులు చేపడితే ఈ సమస్య కొంత మేరకు తీరుతుందని, ఆ పనులు వెంటనే చేపట్టాలని స్థానిక జీహెచ్ఎంసీ(ghmc) డీసీకి సూచించారు. జలమండలి, జీహెచ్ఎంసీ(ghmc) శాఖల అధికారులు సమస్య పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలనీ ఎండీ సూచించారు. అనంతరం కృష్ణానగర్ కాలనీ ఏ, బీ బ్లాక్, లేబర్ అడ్డా ప్రాంతాలు, రహదారులలో మురుగుపారే ప్రాంతాల్లో పర్యటించి శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలను రూపొందించి, తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు.
రహదారులపై ఉన్న తాగునీటి వాల్వ్ చాంబర్లు కొన్ని ప్రాంతాల్లో ధ్వంసమైన విషయం ఈ పర్యటనలో ఎండీ గుర్తించారు. వెంటనే చాంబర్లలో నీరు చేరితే కలుషత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున, వెంటనే అలాంటి తాగు నీటి వాల్వ్ చాంబర్లు గుర్తించి రోడ్డుకు సమాంతరంగా నిర్మించాలని ఏజెన్సీని ఆదేశించారు. తాగునీటి వాల్వ్ చాంబర్ల వద్ద లీకేజీనీ అరికట్టి కలుషిత నీరు సరఫరా కాకుండా నిరోధించాలన్నారు. కలుషిత నీరు సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: Indian Railways: స్వర్గానికి కేరాఫ్‌గా నిలిచే రైల్వే స్టాప్స్.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే!