Indian Railways: సాధారణంగా రైల్వే స్టేషన్లు అనగానే ముందుగా మనకు రద్దీగా ఉండే ఫ్లాట్ ఫామ్స్ గుర్తుకు వస్తాయి. రైలు ఎక్కేందుకు తొందర పడే ప్రయాణికులు కూడా కనిపిస్తుంటారు. అయితే ఇవి కాకుండా మీకు మంచి అనుభూతిని పంచే స్టేషన్లు దేశంలో పదుల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో స్వర్గానికి కేరాఫ్ గా నిలిచే ఆరు రైల్వే స్టాప్స్ ఈ కథనంలో మీ ముందుకు తెచ్చాం. ప్రతీ రైల్వే ప్రయాణికుడు కచ్చితంగా ఈ స్టాప్స్ ను సందర్శించాల్సిందే. అవి కచ్చితంగా మీకు థ్రిల్ ను పంచుతాయి. ఇంతకీ ఆ స్టేషన్లు ఏవి? వాటికి ఉన్న ప్రత్యేకతలు ఏంటీ? ఈ కథనంలో చూద్దాం.
దూద్‌సాగర్ స్టేషన్, గోవా
ప్రసిద్ధ దూద్‌సాగర్ జలపాతం పక్కన ఉన్న ఈ స్టేషన్.. రైల్వే ప్రయాణికులకు కొత్త అనుభూతిని పంచుతుంది. రైళ్ల పట్టాలకు ఆనుకొని ప్రవహించే జలపాతం మిమ్మల్ని మైమరిచిపోయేలా చేస్తుంది. రైళ్లు ఈ స్టేషన్ కు వచ్చేసరికి వేగం తగ్గించి నెమ్మదిగా ప్రయాణిస్తాయి. పచ్చదనంతో నిండిన ఈ ప్రాంత లోయలు మిమ్మల్ని కొద్ది సేపు స్వర్గంలోకి తీసుకెళ్తాయని చూసినవారు చెబుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో దూద్ సాగర్ స్టేషన్ గుండా కచ్చితంగా ప్రయాణించాల్సిందేనని పలువురు సూచిస్తుంటారు.
పఠాన్ కోట్ న్యారో-గేజ్ జంక్షన్, పంజాబ్
సైనిక ప్రాధాన్యం ఉన్న పఠాన్ కోట్ లోని ఈ న్యారో-గేజ్ లైన్ అందమైన కాంగ్రా లోయ వైపు తీసుకువెళ్తుంది. కొండలపై ఉన్న ఇళ్లు, టీ తోటలు ఈ మార్గంలో మీకు దర్శనమిస్తాయి. పచ్చని కొండల గుండా సాగే ఈ రైలు మార్గం.. ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతుంది.
శిమిలిగూడ, ఒడిశా
భారతదేశంలోని అత్యంత ఎత్తైన బ్రాడ్-గేజ్ రైల్వే స్టేషన్గా శిమిలిగూడ ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి సుమారు 997 మీటర్ల ఎత్తులో కోతవలస-కిరండుల్ లైన్‌లో ఇది ఉంది. తూర్పు ఘాట్ కొండలు, దట్టమైన అరణ్యాల మధ్య సాగే ఇక్కడి రైలు ప్రయాణం మైమరిచిపోయేలా చేస్తోంది. శిమిలిగూడ నుంచి సాగే ఈ ప్రయాణంలో సొరంగాలు, వంతెనలు మీకు థ్రిల్ ను పంచుతాయి.
మెట్టుపాళయం, తమిళనాడు
నీలగిరి మౌంటెన్ రైల్వే (UNESCO వారసత్వ ప్రదేశం)కి ఆరంభస్థానం మెట్టుపాళయం స్టేషన్. ఇక్కడి నుంచే మబ్బులతో కప్పబడిన కొండలు, టీ తోటల గుండా మలుపులతో కూడిన రైలు ప్రయాణం మొదలవుతుంది. పచ్చని కొండల గుండా నిర్మించిన రైల్వే ట్రాక్.. మిమ్మల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఈ స్టేషన్ గుండా ఒకసారి ప్రయాణించారంటే జీవితాంతం గుర్తుండిపోతుంది.
రంగ్టాంగ్, బెంగాల్
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే మార్గంలోని చిన్న స్టేషన్ రంగ్టాంగ్, మబ్బులతో కప్పబడిన టీ తోటల మధ్యలో ఉంది. జనసంచారం తక్కువగా ఉండటంతో ప్రశాంతంగా గడపడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. స్థానిక కొండ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని, టాయ్ ట్రైన్ అందించే ప్రత్యేక అనుభవాన్ని దగ్గరగా చూడొచ్చు.
Also Read: Shri Ganesh temple: దేశంలోనే వింతైన ఆలయం.. గొడుగుల్లో ప్రసాదం.. భలే వెరైటీగా ఉందే!
బరోగ్, హిమాచల్ ప్రదేశ్
ప్రసిద్ధ కాల్కా-శిమ్లా రైల్వే మార్గంలోని బరోగ్ స్టేషన్.. సొరంగ మార్గాలకు గుర్తింపు పొందింది. బ్రిటిష్ ఇంజినీర్ హెచ్.ఎస్. బరోగ్ పేరు మీదుగా పిలవబడే ఈ స్టేషన్ చుట్టూ ఉండే పైన్స్ అడవులు, ఎత్తైన పర్వతాలు అద్భుతమైన అనుభూతిని పంచుతుంది.