తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: MLC Local Body Election: జీహెచ్ఎంసీ లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానం ఎన్నిక ఈ సారి ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీలోని పాలక వర్గం సభ్యులు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకునే ఈ స్థానం ఎన్నికకు సంబంధించి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను జారీ చేసింది. సోమవారం ఎన్నికల సంఘం ఈ స్థానానికి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేయటంతో హైదరాబాద్ జిల్లా లోని రాజకీయాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి.
హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని 84 డివిజన్లు ఉన్న ఖైరతాబాద్, చార్మినార్, సికిందరాబాద్ జోన్ల జీహెచ్ఎంసీ ప్రాంతానికి మాత్రమే లోకల్ బాడీ ఎమ్మెల్సీ పరిధి వర్తిస్తుందని జీహెచ్ఎంసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మూడు జోన్లలో ఎక్కువ మంది కార్పొరేటర్ల సంఖ్య చార్మినార్ జోన్ లో ఉంది. రాజకీయ పార్టీల పరస్పర అవగాహనతో జరిగే ఈ ఎన్నికలు గతంలో దాదాపు ఏకగ్రీవంగానే జరిగినా, ఈ సారి ఏకగ్రీవం అవుతుందా? లేక పోలింగ్ నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Also read: Cocaine Seized Hyderabad: హైదరాబాద్ లో కొకైన్ దందా.. నైజీరియా దేశస్థుడు అరెస్ట్
గతంలో మజ్లిస్, కాంగ్రెస్ అవగాహనతో పోటీ చేసిన ఎంఎస్ ప్రభాకర్ రావు నామినేషన్ మినహా మిగిలిన పార్టీలు గానీ, వ్యక్తులు గానీ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఎన్నిక ఏకగ్రీవమే అయినా ఈ సారి అదే ఘట్టం పునరావృతమవుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ సారి హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ పదవీ ఎవర్ని వరిస్తుందోనన్నది చర్చనీయాంశంగా తయారైంది. సింగిల్ గా ఏ పార్టీకి అభ్యర్థిని బరిలో దింపేటంత బలం లేకపోవటంతో ఏ రెండు పార్టీలు మధ్య పరస్పర అవగాహన కుదిరితే గానీ, ఏకగ్రీవయ్యే ఛాన్స్ లేదని చెప్పవచ్చు.
మొత్తం ఓటర్లు 115
జీహెచ్ఎంసీ పరిధిలోని లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 119 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎరగ్రడ్డ, గుడిమల్కాపూర్ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు మృతి చెందగా, ప్రస్తుతం డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. ఇక మెహిదీపట్నం, బహదూర్ పురా డివిజన్లకు కార్పొరేటర్లుగా వ్యవహారిస్తున్న మాజీద్ హుస్సేన్, మొహ్మద్ మోబిన్ లు నాంపల్లి, బహదూర్ పురా అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందటంతో ఆ డివిజన్లు కూడా ఖాళీ కావటంతో మొత్తం 84 మంది కార్పొరేటర్లలో నాలుగు స్థానాలకు కార్పొరేటర్లు లేకపోవటంతో కార్పొరేటర్ల సంఖ్య 80కి తగ్గింది.మిగిలిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ వంటి ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి ఓటర్ల సంఖ్య 115గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also read: BRS Silver jubilee: బీఆర్ఎస్ సభ షిఫ్ట్ అవుతోందా? సక్సెస్ పై అంత అనుమానమా?
ఏ పార్టీ ఏ పార్టీతో కలుస్తుంది?
ఇదివరకు చాలా సార్లు మజ్లిస్, కాంగ్రెస్ అవగాహన ఒప్పందంతో కలిసి ఉభయ పార్టీలు ఒకే అభ్యర్థిని పోటీలో నిలపటం, ఇతర పార్టీలు అభ్యర్థులను బరిలో దింపకపోవటంతో దాదాపు ఈ ఎన్నికల ఏకగ్రీవమైంది. కానీ ఈ సారి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కాంగ్రెస్ సర్కారు ఏర్పడటంతో చాలా మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. కానీ మజ్లిస్, కాంగ్రెస్ ల మధ్య అవగాహన పొత్తు ఉండటంతో , ఎలాగో హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే మినహా కోర్ సిటీలో ఒక్క ఖైరతాబాద్ విజయారెడ్డి మినహా కార్పొరేటర్లు లేని కాంగ్రెస్ ఈ సారి లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానాన్ని మజ్లిస్ కు వదిలేస్తుందా? లేక మజ్లిస్ కున్న ఓటర్ల సంఖ్యాబలంతో కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలో నిలుపుతుందా? అన్నది తేలాల్సి ఉంది.
Also read: Telangana Cabinet: మంత్రివర్గం లోకి ఆ 5 మంది? రాములమ్మకు ఎంత అదృష్టమో?
కోర్ సిటీలోని చార్మినార్ జోన్ లో మజ్లిస్ కు ఎక్కువ మంది కార్పొరేటర్లుండగా, సికిందరాబాద్, ఖైరతాబాద్ జోన్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది కార్పొరేటర్లున్నా, ఈ రెండు పార్టీలు కలుస్తాయా? అన్న చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఒక్కటేనని, ఇటీవల జరిగిన 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్న చర్చ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ దాదాపు బీజేపీతో కలిసే అవకాశాలు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లున్న కాంగ్రేస్ పార్టీకి ఇపుడు కార్పొరేటర్ల సంఖ్య పెరిగినా, కోర్ సిటీలో పెరగలేదనే చెప్పవచ్చు.
Also read: G Kishan Reddy: హోంగార్డులకు కొండంత కష్టం.. కేంద్రమంత్రి ఇంటికెళ్లి మరీ!
సీటు మజ్లిస్ దే
జీహెచ్ఎంసీ కోర్ సిటీలో మొత్తం 84 మంది కార్పొరేటర్లుండగా, వీటిలో ప్రస్తుతం 80 డివిజన్లకే కార్పొరేటర్లున్నారు. ఇందులో మజ్లిస్ పార్టీకే 40 మంది కార్పొరేటర్లుండగా, కాంగ్రెస్ కు 24 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీతో కలిపి మొత్తం 27 ఓట్లున్నాయి. బీజేపీకి 11 మంది కార్పొరేటర్లతో పాటు ఓ ఎమ్మెల్యే, మరో ఎంపీతో కలిపి మొత్తం 13 ఓట్లున్నాయి.
ఎక్స్ అఫీషియో సభ్యుల విషయంలో మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, మరో ఎమ్మెల్సీలుండగా, మొత్తం 40 మంది కార్పొరేటర్లతో కలిపి 49 మంది ఓటర్లున్నారు. మొత్తం 80 ఓట్లలో పై చేయి మజ్లిస్ దే కానున్నందున జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగినా, బీఆర్ఎస్, బీజేపీలు కలిసే అవకాశాలు లేవు. ఒక వేళ కలిసినా , ఈ లోకల్ స్థానాన్ని మజ్లిస్ దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/