Hyderabad Land Dispute: భూ వివాదంలో రిటైర్డ్ ఐఏఎస్‌పై హైదరాబాద్ నేరపరిశోధక విభాగం (సీసీఎస్)లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు బుధవారం ఆయనను పిలిపించి విచారించారు. మరోవైపు, నమ్మి పెట్టుబడులు పెట్టిన తాము సర్వస్వం కోల్పోయే పరిస్థితి ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగింది?
ఖాజాగూడ సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 ఎకరాల భూమికి తాము యజమానులమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజిందర్ పాల్ సింగ్ (Rajinder Pal Singh) ఎలియాస్ ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్వీందర్ సింగ్ ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఐ టవర్స్ డైరెక్టర్ వెంకటేశ్వరరావుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరావుకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఐ టవర్స్ సంస్థ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టింది. ప్రస్తుతం 85శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ప్రైమ్ ల్యాండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఉండడంతో వందలాది మంది కోట్ల రూపాయలు వెచ్చించి యూనిట్లను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో వీరికి డెవలపర్ అయిన వెంకటేశ్వరరావు అగ్రిమెంట్ ఆఫ్ సేల్, సేల్ డీడ్స్ కూడా ఇచ్చాడు.
Also Read: Land Dealing Corruption: అవినీతి భూ దందాలలో జోరు.. అధికారులకు ఏజెంట్లుగా కానిస్టేబుళ్లు
మొదలైన విభేదాలు
2023లో ఆర్పీ సింగ్, హర్వీందర్ కౌర్, డెవలపర్ వెంకటేశ్వరరావు మధ్య విభేధాలు తలెత్తాయి. 2024, ఏప్రిల్ 10న కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వెంకటేశ్వరరావు కమర్షియల్ కాంప్లెక్స్‌లోని 26 నుంచి 29వ అంతస్తులను పూర్తి చేయడానికి మరో ముగ్గురు నలుగురు పెట్టుబడుదారులను తనతో చేర్చుకోవడానికి వీలుంది. అయితే, మొదట ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఆర్పీ సింగ్, హర్వీందర్ కౌర్‌లు ఆ తరువాత దీనికి అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో కాంప్లెక్స్ నిర్మాణం పనులు నిలిచిపోయాయి.
బ్యాంకు విచారణలో..
నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు అవసరం ఉండడంతో వెంకటేశ్వరరావు మార్చి నెలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాడు. కాంప్లెక్స్‌లో తన వాటాగా ఉన్న 22లక్షల చదరపు అడుగుల స్థలంలోపాటు ఐ టవర్స్ డైరెక్టర్లకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులను ష్యూరిటీగా పెడతామని రుణం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. మొదట దీనికి అంగీకరించిన బ్యాంక్ రూ.255 కోట్ల రుణం ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే, మార్చి 31న రుణం ఇవ్వలేమంటూ బ్యాంక్ వర్గాలు ఓ లేఖ ద్వారా వెంకటేశ్వరరావుకు తెలిపాయి. కాంప్లెక్స్ కడుతున్న భూమిలో 3.24 ఎకరాల భూమి చేతన్ కౌర్ వాటాగా ఉందని పేర్కొన్నాయి. ఆమెతో ఎలాంటి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు లేనందున లోన్ ఇవ్వలేమని తెలియచేశాయి. దాంతో వెంకటేశ్వరరావు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవాలను దాచి పెట్టి ఆర్పీ సింగ్, హర్వీందర్ సింగ్ తనను మోసం చేశారని పేర్కొన్నాడు. ఈ మేరకు రాయదుర్గం స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
బాధితుల ఆవేదన
ఈ వివాదం నేపథ్యంలో తాము నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, సమస్యను పరిష్కరించాలని వందల మంది బాధితులు ఆర్పీ సింగ్‌ను అడిగారు. అయితే, ఆయన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోగా బాధితులనే బెదిరించడం మొదలు పెట్టాడు. తాను ఐఏఎస్ అధికారిగా పని చేశానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, మీ దిక్కున్న చోట చెప్పుకోండని చెప్పటం ప్రారంభించాడు. దీని వల్ల కాంప్లెక్స్‌లో యూనిట్లను కొన్న తాము దాదాపు రూ.2 వేల కోట్ల దాకా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే సీసీఎస్ అధికారులకు ఆర్పీ సింగ్, హర్వీందర్ కౌర్ తదితరులపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Also Read: Temple Lands: యథేచ్ఛగా ఆలయ భూముల ఆక్రమణ.. 20124.03 ఎకరాల కబ్జా!