Land Dealing Corruption: కేసుల విచారణలో సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కానీ కొందరి తీరుతో ఆ కీర్తి క్రమంగా మసకబారుతున్నది. పోలీస్ (Police) శాఖ పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నా, బదిలీల విషయంలో వృత్తి నైపుణ్యానికే ప్రాధాన్యమిస్తున్నా కొందరు అధికారుల ప్రవర్తన మారడం లేదు. అవినీతి, భూ, ఆస్తి తగాదాల కేసుల్లో చిక్కుకొని తమతోపాటు శాఖ పరువునూ అభాసుపాలు చేస్తున్నారు.
పీఎస్‌కు వస్తే మామూళ్లు ఇవ్వాల్సిందేనా?
కేసులొస్తే కాసులు రాలాల్సిందే. స్టేషన్‌కు వస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే. ఎంత పెద్ద కేసైనా స్టేషన్‌లోనే సెటిల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు ఆదేశించినా ఖాతరు చేయడం లేదు. బడా బాబులకు కొమ్ముకాస్తున్నారు. జిల్లా పరిధిలోని స్టేషన్లలో కొందరు పోలీస్ (Police) అధికారుల పని తీరు ఇలాగే ఉన్నది. చాలా స్టేషన్లలో అసలు డబ్బులివ్వనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొన్నది. కేసు కట్టాలన్నా, పేరు తొలగించాలన్నా ప్రతి దానికీ ధరను నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
Also Read: MLC Kavitha: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేయించాలి.. కవిత డిమాండ్!
తరచు ఇబ్బంది
ఇటీవల జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పై జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. జిల్లా కేంద్రంలో ఇటీవల ఇంటి యజమాని ఇల్లు అమ్మగా ఓ వ్యక్తి కొంత అడ్వాన్స్ ఇచ్చాడు. కొన్ని కారణాల వల్ల ఆ ఇంటిని వేరే వ్యక్తికి అమ్మడంతో అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి యజమానిని తరచు ఇబ్బంది పెట్టడంతో అతను పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇద్దరి మధ్య లావాదేవీల సమస్యను పరిష్కరించి తన ఫీజును కిందిస్థాయి సిబ్బంది ద్వారా వసూలు చేశారని బాధితుడు తెలిపాడు.
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
జిల్లాలోని ఓ మండలంలో పొలం పంచాయతీలో బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే కేసు చేయడానికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. మరో గ్రామంలో వ్యవసాయబ పొలంలో నాటిన మొక్కలను తొలగించి, తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన కేసులో అలసత్వం ప్రదర్శించడంతో బాధితులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరో గ్రామంలో తమ పొలాన్ని అక్రమించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలికారని ఆరోపణలు వచ్చాయి.
మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పవనంపల్లి గ్రామానికి చెందిన రైతు తెలుగు తిమ్మప్పకు పొలం గొడవలున్నాయి. అయితే, పోలీసులు మరో వర్గం వర్గానికి వత్తాసు పలికి తనను విచక్షణ రహితంగా కొట్టారని మల్దకల్ పోలీసులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. తనకు ఎస్సై నుండి ప్రాణ హాని ఉందని పేర్కొన్నాడు. గద్వాల సర్కిల్ పరిధిలోని ఓ స్టేషన్‌లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ వసూళ్లు పతాక స్థాయికి చేరడంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అతనిని మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇలా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో అవినీతి అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Congress party ministers: త్వరలో మాడ్గుల నుంచి దేవరకొండ వరకు డబుల్ రోడ్డు