Hydraa: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని తెలంగాణ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భూములను హైడ్రా సోమవారం పరిరక్షించింది. సర్వే నెంబర్ 29/1 తో పాటు సర్వే నెంబర్ 30లో 23.28 ఎకరాలను తెలంగాణ ఆగ్రోస్‌కు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించింది. ఈ భూమికి ఆనుకుని ఉన్న దుర్గానగర్, కమలాబాయ్ నగర్, బాబానగర్ కాలనీలవైపు కొంతమేర ఆక్రమణలు జరిగినట్లు హైడ్రా గుర్తించింది. ఇలా ఇప్పటికే 4 ఎకరాలు కబ్జాకు గురైనట్లు నిర్థారించింది. వరుసగా కబ్జాలు జరుగుతున్నాయని, వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించి ఆగ్రోస్ భూమిని కాపాడాలంటూ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే ఇళ్లు కట్టుకుని నివాసం ఉన్న వాటిని మినహాయించారు. వాటి జోలికి వెళ్లకుండా ప్రీకాస్ట్ ఇటుకలతో ప్రహరీ నిర్మించి అందులో వేసిన చిన్న షెడ్డులను తొలగించారు. సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ చేసేందుకు వినియోగిస్తున్న షెడ్లను, స్క్రాప్ దుకాణాన్ని ఖాళీ చేయించి వాటిని తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది.
Also Read: Starlink Monthly Plan: ‘స్టార్‌లింక్’ కనెక్షన్ రేట్లు వచ్చేశాయ్.. మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ఎంతంటే?
ఇప్పటికే పలు కేసులు
స్థానికంగా లావణ్య అనే మహిళ తప్పుడు పత్రాలతో రెండు ఎకరాలకు పైగా చిన్న ప్లాట్లుగా చేసి అమ్మేయగా, తెలంగాణ ఆగ్రోస్ ఆమెపై నాచారం పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టింది. ఇక, అదే సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి రాజు అనే వ్యక్తితో కలిసి 1200 గజాల ఆక్రమణకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, మహేందర్ అనే వ్యక్తి 2 వేల గజాలకు పైగా ఆక్రమించి ప్లాట్లుగా విడదీసి, ప్రస్తుతానికి చిన్న షెడ్డులు వేసి వాటిని కిరాయికి ఇచ్చినట్టు ఆగ్రోస్ అధికారులు ఫిర్యాదు చేశారు. వీరందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ఇలా వివిధ కట్టడాలతో ఆక్రమణలకు పాల్పడితే, వాటిని తొలగించి తెలంగాణ ఆగ్రోస్‌కు చెందిన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. మల్లాపూర్ డివిజన్‌లో ఎక్కడా కూడా జనం నివసిస్తున్న వాసాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.
Also Read: International Zoo Project: ఫోర్త్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో జూ పార్క్ ఏర్పాటు.. ఈ నెల చివరణ..!

