Hyderabad Floods: గ్రేటర్ హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నగరవాసుల దాహర్తిని తీర్చే జంట జలాశయాలకు వరద ఉద్ధృతి (Hyderabad Floods) పెరిగింది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ (Himayat Sagar) జలాశయాలకు చెందిన 15 గేట్లను ఎత్తి 15 వేల 704 క్యూసెక్కుల నీటిని భారీగా విడుదల చేయటంతో మూసీకి వరద ఉద్ధృతి పెరిగింది. చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో వరద నీరు బ్రిడ్జిని తాకుతూ ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతంలోని మూసా నగర్, శంకర్ నగర్, అంబేద్కర్ నగర్ లు నీట మునిగాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పరివాక ప్రాంతంలో నీట మునిగిన ప్రాంతాల వాసులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. గోడోఖీ కబర్, అంబర్ పేట, గోల్నాక తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దాదాపు ఎనిమిది పునరావాస కేంద్రాల్లోకి 1200 మందిని వాటిల్లోకి తరలించారు.
Also Read: Harish Rao: ఆదాయం కోసం రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తారా.. హరీష్ రావు ఫైర్!
మూసీ పరివాహక ప్రాంతం అతలాకుతలం
పునరావాస కేంద్రాల ఏర్పాటు, అందులో వరద బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నాం భోజనంతో పాటు రాత్రి పూట వారు పడుకునేందుకు కావల్సిన సామాగ్రిని జీహెచ్ఎంసీ సిబ్బంది సమకూరుస్తుంది. ఎలాంటి వైరల్ జ్వరాలు ప్రబలకుండా బాధితులకు జీహెచ్ఎంసీ మెడిసిన్ ను కూడా అందిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం జంట జలాశయాల నుంచి 25 వేల 114 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, అర్థరాత్రి ఏకంగా 34 వేల క్యూ సెక్కుల నీటిని విడుదల చేయటంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. మూసీ పరివాహక ప్రాంతం అతలాకుతలమైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహాత్మగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) కూడా నీట మునిగింది.
మొకాలి లోతు వరకు వరద నీరు
బస్సులు ప్రయాణికులను ఎక్కించుకునే ఫ్లాట్ ఫామ్ లలోకి మొకాలి లోతు వరకు వరద నీరు రావటంతో పలు జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల రాకపోకలకు అంతరాయమేర్పడింది. నయాపూల్, పురానాపూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిలను ఆనుకుని వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించటంతో బ్రిడ్జిపై పోలీసులు రాకపోకలను అనుమతించటం లేదు. మూసారాంబాగ్ (Moosarambagh) వద్ద బ్రిడ్జి నిర్మాణం కోసం తీసుకువచ్చిన మెటీరియల్ వరదలో కొట్టుకుపోయింది. ఇటీవలే కొత్తగా నిర్మించిన బ్రిడ్జికి ఎలాంటి నష్టం జరగలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ప్రక్రటించారు. చాదర్ ఘాట్ వద్ద శివాలయంలో చిక్కుకుపోయిన పూజారి కుటుంబాన్ని హైడ్రా సమయ స్పూర్తితో వ్యవహారించి కాపాడింది. వరదలో చిక్కుకుని భవనాలపై ఉండిపోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులను గుర్తించి, వారికి డ్రోన్స్ సహాయంతో హైడ్రా ఆహారం అందజేసింది.
జలాశయాలకు భారీగా పోటెత్తిన వరద
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మహానగరవాసుల దాహర్తిని తీర్చే జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల (Himayat Sagar) కు ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్ల, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. భారీగా వరద నీరు చేరుతూ జంట జలాశయాలు నీటి మట్టాలు గరిష్ట స్థాయిలో చేరుతుండటంతో ఎప్పటికపుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం కల్లా రెండు జలాశయాల 15 గేట్లు ఎత్తి 15 వేల 704 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (3900 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1788.55 (3567 టీఎంసీలకు) చేరింది.
ఇన్ ఫ్లోగా 7 వేల క్యూసెక్కుల నీరు
ఇన్ ఫ్లూ 9 వేల క్యూసెక్కులుగా వస్తుండగా, రిజర్వాయర్ 11 గేట్లను తొమ్మిది అడుగుల మేరకు ఎత్తి 9284 క్యూసెక్కులను నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం సుమారు 1763.50 అడుగులు (2970 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం 1762.55 అడుగులు(2706 టీఎంసీలు)గా ఉండగా, ఇన్ ఫ్లోగా 7 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రిజర్వాయర్ నాలుగు గేట్లను అయిదు అడుగుల ఎత్తు మేరకు ఎత్తి దిగువకు 6420 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. రెండు జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు.
Also Read: Little Hearts OTT: ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సర్‌ప్రైజ్ ఏంటంటే?