V. C. Sajjanar: మనుషుల్లో మానవత్వం నశిస్తున్న ఘటనలను ఇటీవల చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదం అనంతరం రక్తపు మడుగులో ఉన్న వారికి సాయం చేయాల్సింది పోయి.. కొందరు వీడియోలు తీస్తూ చోద్యం చూసిన సందర్భాల్లో వార్తల్లో ప్రసారమయ్యాయి. అలాగే నడిరోడ్డుపై సాటి మనిషిని అతి కిరాతకంగా హత్య చేస్తున్నా పట్టించుకోని ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలాంటిది ఓ వ్యక్తి తన ప్రాణాలకు తెగించి మరి అగ్నిప్రమాద ఘటనలో సాయం చేసిన ఉదంతం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ఆ వ్యక్తి చేసిన పనిని మెచ్చుకుంటూ నెట్టింట పోస్టు పెట్టడం విశేషం.
అసలేం జరిగిందంటే?
‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్ అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్ అనే వ్యక్తి.. ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో ఎంతో తెగువ చూపారని సజ్జనార్ తెలిపారు. అతడ్ని చూశాక మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుందని పేర్కొన్నారు. ఓ వైపు మంటలు, మరోవైపు బాధితుల ఆర్తనాదాలు వెనక్కి లాగేందుకు యత్నిస్తున్నప్పటికీ దినేష్ ధైర్యంగా ముందడుగు వేశారని సీపీ ప్రశంసించారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నారని కొనియాడారు.
‘దినేష్‌ను సత్కరించడం గర్వకారణం’
‘ప్రమాదం జరిగితే వీడియోలు తీస్తూ కాలక్షేపం చేసే ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి దినేష్ చేసిన సాయం నిజంగా సాహసోపేతం. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దినేష్‌ను సత్కరించుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న మహమాద్ జకీర్, కలీం, రహీం, అమర్ తో పాటు చొరవ చూపిన కార్పొరేటర్లు సురేఖ ఓం ప్రకాశ్, జఫర్ ఖాన్ కు అభినందనలు తెలియజేస్తున్నాను’ అని సజ్జనార్ పేర్కొన్నారు.
Also Read: Kalvakuntla Kavitha: రిపబ్లిక్ డే రోజన కవిత సంచలన నిర్ణయం.. బీసీల కోసం కీలక ప్రకటన
వెల్లువిరిసిన మతసామరస్యం
అయితే దినేష్ మాత్రమే కాదని.. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన సందర్భంగా మత సామరస్యం వెల్లువిరిసిందని సీపీ సజ్జనార్ ఎక్స్ లో పేర్కొన్నారు. అందరూ భుజం భుజం కలిపి సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. కష్టం వస్తే ‘మేమంతా ఒక్కటే’ అని నిరూపించి, హైదరాబాద్ గంగా – జమునా తహజీబ్ సంస్కృతిని మరోసారి చాటిచెప్పారని సజ్జరాన్ రాసుకొచ్చారు. వారందరికీ సెల్యూట్ అంటూ సీపీ ప్రశంసల జల్లు కురిపించారు. దినేష్ కు శాలువ కప్పి సన్మానిస్తున్న ఫొటోను సైతం ఈ సందర్భంగా సజ్జనార్ షేర్ చేశారు.
‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?' అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం దినేష్. అఫ్జల్‌గంజ్‌కు చెందిన దినేష్, ఇటీవల నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద సమయంలో చూపిన తెగువ చూస్తే.. మానవత్వం ఇంకా చనిపోలేదని అనిపిస్తుంది.
ఓ పక్క ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. మరోపక్క… pic.twitter.com/MMNt5HjERv
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 26, 2026

