Republic Day 2026: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి తలపెట్టిన రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జిస్టిస్. అబ్దుల్ నజీర్.. ఈ వేడుకల్లో పాల్గొని మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రుల సమక్షంలో జాతీయ జెండాకు గవర్నర్ వందనం చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వ పాలన గురించి రాష్ట్ర ప్రజలకు గవర్నర్ వివరించే ప్రయత్నం చేశారు. మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన శకటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
22 శకటాల ప్రదర్శన..
అమరావతిలో నిర్వహించిన తొలి రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమరవాతి రాజధాని నిర్మాణం, దాని పురోగతికి సంబంధించి శకటం అందరినీ ఆకట్టుకుంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్, విద్యారంగంలో మార్పులు – పథకాలు, వందేమాతరం, పది సూత్రాల మిషన్, అటవీశాఖకు సంబంధిత అంశాలు, నీటిపారుదల శాఖ ప్రాజెక్టులు, పాఠశాల విద్య సంస్కరణలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన శకటాలు.. రిపబ్లిక్ డే వేడుకల్లో హైలెట్ గా నిలిచాయి. మరోవైపు పరేడ్ లో 11 దళాలు పాల్గొనగా.. అమరావతి రైతులు, విద్యార్థులకు సంబంధించిన గ్యాలరీలు సైతం అందరినీ ఆకట్టుకున్నాయి
వైసీపీ పాలనపై చురకలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి జాతీయ జెండాను ఎగురువేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మరోవైపు గత వైసీపీ పాలనపై గవర్నల్ పరోక్ష విమర్శలు చేశారు. గత కొన్నేళ్లుగా ఏపీ స్పష్టమైన దిశ లేకుండా సాగిందన్న ఆయన.. ఆఖరికి రాజధాని నిర్మాణం కూడా ఆగిపోయిందన్నారు. దీనివల్ల ఏపీ ప్రజల ఆర్థిక విశ్వాసం దెబ్బతిన్నట్లు అభిప్రాయపడ్డారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ స్పష్టం చేశారు. కాలానికి అనుగుణంగా పాలన మారాలన్నది ప్రభుత్వ సిద్ధాంతమని పేర్కొన్నారు.
Also Read: Republic Day: రిపబ్లిక్ డే రోజున.. జాతీయ జెండాకు అవమానం.. ఏం జరిగిందంటే?
పెట్టుబడుల్లో 1/4 వాటా ఏపీకే!
జీరో పావర్టి – పీ4 పాలసీ (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్) ద్వారా 2047 నాటికి పేదరికం నిర్మూలన చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా గవర్నర్ జిస్టిస్. అబ్దుల్ నజీర్ అన్నారు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 308 లక్షల కోట్లు చేయడంతో పాటు తలసరి ఆదాయం రూ. 55 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ పాలసీలు, సమర్థవంతమైన గవర్నెన్స్ వల్ల రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని గవర్నర్ చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 1/4 వాటాను దక్కించుకుందని గవర్నర్ తెలియజేశారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. స్పేస్ సిటీ ఏర్పాటుతో ఏపీని ఆవిష్కరణల కేంద్రంగా నిలబెడుతున్నామని తెలియజేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు @అమరావతి https://t.co/SSVtvfwcb4
— Telugu Desam Party (@JaiTDP) January 26, 2026

