TPCC Chief: హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల త్యాగాలు, కృషి ఫలితంగానే దేశంలోని ప్రజలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.
‘2014 నుంచి అంధకారంలో దేశం’
దేశ ప్రజలు అనేక ఇవాళ అనేక హక్కులు అనుభవిస్తున్నారంటే.. అది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమనని టీపీసీసీ చీఫ్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని పెద్దలు.. 2014 నుండి దేశాన్ని అంధకారం చేశారని మండిపడ్డారు. వాళ్లు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగం మార్చడం, గాంధీ, నెహ్రూల కుటుంబాలను ప్రజల నుంచి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని టీపీసీసీ చీఫ్ విమర్శించారు. ఇందులో భాగంగానే జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మ గాంధీ పేరును తొలగించారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. MGNREGA పథకం పేరు చెప్పగానే.. కాంగ్రెస్, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలే గుర్తుకు వస్తున్నారన్న కోపంతో ఆ స్కీమ్ ను నిర్వీర్యం చేసే కుట్రకు బీజేపీ తెరలేపిందన్నారు.
‘యూపీఏ పథకాల తొలగింపుపై ఆగ్రహం’
2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక వాదానికి తూట్లు పొడిచే కుట్రలు చేస్తున్నారన్న మహేష్ కుమార్ గౌడ్.. చివరకి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అటు కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ కానుకను కాంగ్రెస్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Also Read: Republic Day 2026: పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. తెలంగాణ ఘనతలపై.. గవర్నర్ అదిరిపోయే స్పీచ్!
‘రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం’
ఏఐసీసీ నాయకులు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కుల సర్వే తో యావత్ రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ‘నిరుద్యోగులకు ఉద్యోగాలు విషయంలో కట్టుబడి ఉన్నాం. కులగణన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి. మహాత్ముడి ఆధ్వర్యంలో స్వతంత్ర పోరాటం విజయవంతం అయింది. అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగం రాశారు. మహాత్మా గాంధీ కలలు నెరవేర్చే దూరదృష్టి ఉన్న వ్యక్తి నెహ్రూ. ఐరన్ లేడి ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి గట్టి పునాదులు వేశారు’ అని టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం – గాంధీ భవన్
https://t.co/4z7XblDIow— Telangana Congress (@INCTelangana) January 26, 2026

