Harish Rao: రైతుబంధు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కేసుల మీద ఉన్న శ్రద్ధ పాలనపై చూపడం లేదని విమర్శించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని, వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు ప్రజలను నిలువునా మోసం చేస్తోందని మండిపడ్డారు.
Also Read: Harish Rao: వరి నాట్లు వేసిన రైతులకు న్యాయం చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ!
రైతులు తీవ్ర ఇబ్బందులు
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక నర్సాపూర్ మార్కెట్ వంటి పనులను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బావుల దగ్గర కరెంటు సరిగా ఇవ్వలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ తెలిపారు. ‘ఓట్లప్పుడే కాంగ్రెస్కు రైతులు గుర్తుకు వస్తారు. రైతుబంధు సకాలంలో ఇవ్వని ఈ సర్కారుకు మున్సిపల్ ఎన్నికల్లో రైతులు కారు గుర్తుతో వాత పెట్టడం ఖాయం. రెండేళ్లుగా స్కాలర్షిప్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు లోపాయికారీ ఒప్పందంతో పని చేస్తున్నాయి. ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

