VC Sajjanar: మహిళలు…చిన్నపిల్లల భద్రతలో రాజీ పడేదే లేదని హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ (VC Sajjanar) స్పష్టం చేశారు. వీరి పట్ల నేరాలకు పాల్పడేవారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, పిల్లల భద్రత సామాజిక బాధ్యత అని చెప్పారు. బంజారాహిల్స్ లోని ఐసీసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని ఆడిటోరియంలో సోమవారం మహిళా భద్రత విభాగం పని తీరుపై కమిషనర్ సజ్జనార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు బాధతో పోలీస్ స్టేషన్లకు వస్తారని చెప్పారు. వారిపట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించాలన్నారు. అన్యాయం జరిగిందని వచ్చే బాధిత మహిళలకు మేం అండగా ఉన్నామన్న భరోసాను కల్పించాలని చెప్పారు. కేసులు నమోదు చేసి వదిలేయకుండా సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు.
Also Read: VC Sajjanar: కమిషనర్ సజ్జనార్ సంచలన నిర్ణయం.. సిటీ పోలీస్ ప్రక్షాళన పై ఫోకస్..!
బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవు
పోక్సో, అత్యాచారా కేసుల విషయంలో నిర్లక్ష్యం కనబరిస్తే బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రతపై మహిళలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గుడ్ టచ్..బ్యాడ్ టచ్ గురించి చిన్నపిల్లలకు చెప్పాలన్నారు. స్వీయరక్షణ కోసం ఏం చేయాలన్నది నేర్పించాలని చెప్పారు ఆసరేషన్ ముస్కాన్…స్మైల్ అప్పడే కాకుండా మిగతా సమయాల్లో కూడా వీధి బాలలు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న బాల కార్మికులను రక్షించటానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఆడపిల్లల జోలికి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు
ఆడపిల్లల జోలికి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని చెప్పారు. ఇలాంటి వారికి పాస్ పోర్ట్ మంజూరు కాదని, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావన్నారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల వివరాలను తెలుసుకున్నారు. షీ టీమ్స్, భరోసా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, జువెనైల్ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాస్, మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: VC Sajjanar: పండగకు ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు
