Charminar Fire Accident: 8మంది చిన్నారులతో సహా పదిహేడు మంది ప్రాణాలను బలి తీసుకున్న గుల్జార్ హౌస్ ప్రమాదానికి కారణం ఇన్వర్టర్ లో ఏర్పడిన షార్ట్ సర్క్యూటే అని వెల్లడైంది. హైదరాబాద్ తోపాటు నాగ్ పూర్ కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు దీనిని నిర్ధారించారు. ఈ మేరకు ఫైర్ డీజీ నాగిరెడ్డికి నివేదికను అంద చేయనున్నారు. ఈనెల 18న తెల్లవారుఝాము సమయంలో గుల్జార్ హౌస్ లో నివాసముంటున్న ప్రహ్లాద్ మోడీ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.
దీంట్లో పదేళ్లలోపు చిన్నారులు ఎనిమిది మంది…60 సంవత్సరాల వయసు దాటిన 4గురితో సహా మొత్తం 17మంది మృత్యువాత పడ్డారు. ప్రాథమిక విచారణలో అగ్నిప్రమాదం కారణంగా దట్టంగా వెలువడ్డ పొగతో ఊపిరి ఆడకనే వీళ్లు చనిపోయినట్టుగా తెలిసింది. కాగా, ఫైరింజన్లు సకాలంలో రాలేదని, అంబులెన్సుల్లో ఆక్సిజన్ సౌకర్యాలు లేకపోవటం వల్లనే ఇంతమంది చనిపోయారంటూ వేర్వేరు రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఆరోపణలు చేశారు.
Also Read: Payyavula Keshav: జగన్ కి భయం పట్టేసింది.. మంత్రి సంచలన కామెంట్స్!
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. దీని కోసం ఆరుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాగా, హైదరాబాద్, నాగ్ పూర్ లకు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు జరిపిన పరిశీలనలో ఇన్వర్టర్ లో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టమైంది. అగ్నిప్రమాదం జరిగినపుడు ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్ లో ఉందని తేలింది.
ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లయ్ మాత్రమే ఉన్నట్టుగా వెల్లడైంది. ఇన్వర్టర్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం వల్ల సెకన్లలోనే మంటలు ఎగిసి పడ్డాయని తేలింది. ఈ క్రమంలో ఏసీ కంప్రెషర్లు కూడా పేలి పోవటంతో మంటలు మరింత పెద్దగా వ్యాపించాయని, దాంతో దట్టమైన పొగ ఇల్లంతా అలుముకుందని వెల్లడైంది. బయటకు రావటానికి ఉన్న మెట్ల మార్గంలో మంటలు ఎగిసి పడటం, దట్టంగా పొగ అలుముకోవటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక పోయినట్టుగా నిర్ధారణ అయ్యింది.
దాంతో ప్రాణాలు కాపాడుకోవటానికి గదుల్లోకి వెళ్లి తలుపులు మూసి వేసుకున్నట్టుగా వెల్లడైంది. గదుల్లో మొత్తం పొగ వ్యాపించటంతో ఊపిరి ఆడక చిన్నపిల్లలు, వృద్ధులు నిమిషాల వ్యవధిలోనే చనిపోయినట్టుగా తేలింది. మరో నలుగురిని ఆస్పత్రులకు తరలించినా ఫలితం లేకుండా పోయిందని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు నివేదికను సిద్ధం చేశారు. దీనిని ఫైర్ డీజీ నాగిరెడ్డికి అందచేయనున్నారు.
Also Raad: YS Jagan: లిక్కర్ స్కామ్‌పై కుండబద్దలు కొట్టిన జగన్.. విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు!