YS Jagan: ఏపీలో మద్యం కుంభకోణం అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సన్నిహితులు ఒక్కొక్కొరిగా జైలుకు వెళ్తున్నారు. రేపో మాపో జగన్ ను సైతం అరెస్ట్ చేస్తారంటూ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కామ్ పై మౌనం వహిస్తూ వస్తున్న జగన్.. తాజాగా పెదవి విప్పారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఏకంగా మీడియా సమావేశమే నిర్వహించారు.
లాభాపేక్ష లేకుండా అమ్మకాలు
లిక్కర్ స్కామ్ (AP liquor scam) అంటూ కూటమి ప్రభుత్వం (AP Govt) తప్పుడు ప్రచారానికి తెరలేపిందని వైఎస్ జగన్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు దిగారని మండిపడ్డారు. తమ హయాంలో ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించిందని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు ఇస్తారా? ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే లంచాలు ఇస్తారా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. తమ పాలనలో లిక్కర్ సేల్ భారీగా తగ్గిందని.. ట్యాక్స్ పెంచడం ద్వారా లాభాలు కంపెనీలకు వెళ్లకుండా అడ్డుకున్నామని చెప్పారు. తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచామని జగన్ అన్నారు. ప్రతీ బాటిల్ పై క్యూఆర్ కోడ్ పెట్టి లాభాపేక్ష లేకుండా అమ్మకాలు జరిపినట్లు జగన్ వ్యాఖ్యానించారు.
పెరిగిన లిక్కర్ సేల్!
మద్యానికి సంబంధించి ఏపీలో ఎలాంటి కుంభకోణం చోటుచేసుకోలేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. గత పాలనలో అధిక ధరలకు మద్యం విక్రయించారన్న ఆరోపణలను ఖండించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని జగన్ చెప్పారు. 12 నెలల కాలంలో రాష్ట్రంలో లిక్కర్ సేల్ బాగా పెరిగిందని అన్నారు. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయని.. బియ్యానికి బదులుగా మద్యాన్ని డోర్ డెలివరీలు చేస్తున్నారని జగన్ అన్నారు. గతంలో లేని కొత్త బ్రాండ్లను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు.
విజయసాయిరెడ్డి లొంగిపోయారు!
వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్ జరగకపోయినా.. లిక్కర్ స్కాం జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. చిన్న స్థాయి ఉద్యోగులను భయపెట్టి, బెదిరించి వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి (Vijaysai Reddy).. చంద్రబాబు (CM Chandrababu)కు లొంగిపోయారని జగన్ ఆరోపించారు. వైసీపీకి సరిపడ ఎమ్మెల్యేలు లేరని.. మరోసారి రాజ్యసభకు అవకాశముండదని తెలిసి చంద్రబాబుకు మేలు జరిగేలా తన సీటును విజయసాయిరెడ్డి అమ్మేసుకున్నారని విమర్శించారు. అలాంటి వారు ఇచ్చే వాంగ్మూలానికి విలువ ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.
Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
వాళ్లు మచ్చలేని అధికారులు!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ తో సంబంధం ఏముందని జగన్ ప్రశ్నించారు. సిట్ అధికారులు అరెస్ట్ చేసిన ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకి ఈ కుంభకోణంలో సంబంధం ఏముందని నిలదీశారు. కేసిరెడ్డికి, బేవరేజెస్ కార్పొరేషన్ కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. రాజ్ కసిరెడ్డిని సులువుగా ప్రలోభపెట్టొచ్చనే ఉద్దేశంతోనే ఇందులో ఇరికించారని జగన్ ఆరోపించారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మచ్చలేని అధికారులని అన్నారు. వారు తమ పిల్లలకు పెళ్లి చేయాలని చూస్తుంటే తీసుకొచ్చి జైళ్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.