Sankranti Festival: సిటీలో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా సిటీలో పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా పాతబస్తీ, బేగంబజార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలీ వంటి ప్రాంతాల్లో యువత పండుగను ఘనంగా జరుపుకుంది. డీజే మ్యూజిక్, మైక్ సౌండ్ ల మధ్య దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో భవనాలపై నుంచి యువకులు పతంగిలను ఎగురవేశారు. ఆకాశంలో రెండు పతంగిలను కొట్లాడించి, చివరకు రెండింటిలో ఒకట్ కట్ కాగానే, యువత కొట్టిన కేరింతలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అకాశంలో రంగురంగుల పతంగిలు ఎగురవేయటంతో ఇంధ్రధనస్సును తలపించింది. ముఖ్యంగా పతంగిలను ఎగురవేయటమే గాక, వాటిని కొట్లాడించి యువత ఉత్సాహా భరితంగా సంబరాలు నిర్వహించింది. మొదలైన ఈ పతంగిల పండుగ గురు, శుక్రవారాల్లో కూడా కొనసాగే అవకాశముంది. గడిచిన నాలుగైదు రోజుల నుంచి పతంగిలు, మాంజాలు, సాదా (ధారం), చరక్ వంటివి విక్రయిస్తుండగా, బుధవారం వీటి విక్రయాలు మరింత జోరుగా సాగాయి. గురు, శుక్రవారాల్లో కూడా ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిసింది.
అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్
ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు దాహర్తిని తీర్చే ఉస్మాన్ సాగర్ (గండిపేట) వద్ద వందలాది మంది యువకులు పతంగిలను ఎగురవేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికిందరాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ ఫెస్టివల్ కు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ,కర్ణాటక నుంచే గాక, థాయ్ లాండ్, మలేషియా తదితర మొత్తం 19 దేశాల నుంచి సుమారు 40 మంది వరకు జాతీయ, అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ వచ్చారు.
యువకులు సామూహికంగా పతంగిలు
సుమారు 12 రకాల పతంగిలను ఈ కైట్ ఫెస్టివల్ లో ఎగురవేశారు. చాలా మంది చిన్నారులు, మహిళలు ఈ ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ పతంగిలను ఎగురవేయటాన్ని తిలకించేందుకు తరలి వచ్చారు. ఇక్కడ ఎగురవేసిన పతంగిలు చిన్నారులను, మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కైట్ ఫెస్టివల్ 2026ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ గురువారం కూడా జరగనుంది. ముఖ్యంగా ఈ ఫెస్టివల్ లో తెలంగాణ సాంప్రదాయమైన మిఠాయిలతో పాటు దేశంలోనే వివిధ రాష్ట్రాలు, ప్రపంచంలోని వివిధ దేశాల స్వీట్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఖాళీ స్థలాలు, పార్కులు, క్రీడా మైదానాలు వంటి ప్రాంతాల్లో యువకులు సామూహికంగా పతంగిలను ఎగురవేశారు.
Also Read: BMW Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ ఎలా ఉందంటే..

