BMW Trailer: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నుంచి ఈ సంక్రాంతికి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. భోగి పండుగ కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ (BMW Trailer) ఎలా ఉందంటే..
Also Read- Kalyan Padala: అరె ఏంట్రా ఇది.. స్టార్ హీరోకు కూడా ఇంత సెక్యూరిటీ ఉండదుగా!
హి ఈజ్ ద రైట్ పర్సన్
‘‘ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్‌లు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్.. ఓ తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు’’ అనే డైలాగ్‌లో ప్రస్తుత రవితేజ మూడ్ ఎలా ఉందో, ఆయన అభిమానులు ఏం అనుకుంటున్నారో.. ఆయన నోటితోనే చెప్పించాడు దర్శకుడు. ఇక వెంటనే కథలోకి తీసుకెళ్లాడు. ‘రామ్ లైఫ్‌లో ప్రేమ, పెళ్లి ఏదైనా సరే.. అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది’ అని డింపుల్‌తో చెప్పించి భార్యభర్తల మధ్య అనుబంధాన్ని టచ్ చేశారు. ఇక ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. ఆమె చెప్పిన డైలాగ్‌కు రివర్స్‌లో మాస్ రాజా ప్రేమయాణం మొదలైంది. అదిరిపోయే రేంజ్‌లో ఆషికా (Ashika Ranganath)ను దింపి, ‘ఏ రిలేషన్ షిప్ అయినా మనం కలిసే పర్సన్‌ని బట్టి డిపెండై ఉంటుంది. రైటా? రాంగా? అని. ఐ థింక్ హి ఈజ్ ద రైట్ పర్సన్’ అని ఆషికా చెప్పే డైలాగ్‌లో రవితేజకు అసలు చిక్కులు మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే వెంకీ ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’ టైప్ అన్నమాట. ఈ ఇద్దరు కత్తులతో రవితేజ ఎన్ని ఇబ్బందులు పడ్డాడనేది, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో దర్శకుడు నడిపించాడు. ఆషికా, డింపుల్ (Dimple Hayathi) ఎదురుపడే సీన్, సత్య, వెన్నెల కిశోర్ ఎంట్రీలు, డైలాగ్స్ అన్నీ కూడా హిలేరియస్‌గా పండాయి.
Also Read- Sankranthi 2026 Buses: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? హైదరాబాద్ వాసులకు ఆర్టీసీ కీలక సూచనలు!
ఎప్పటికీ తెగని సంసారం
‘‘మగాళ్ల ముందు మాసే కావచ్చు.. కానీ ఇక్కడుంది ఇద్దరు ఆడాళ్లు.. టాస్ ఏసి బొమ్మా, బొరుసా? అని నిలబెట్టెళ్లు’’ అనే డైలాగ్‌తో రవితేజ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ డైలాగ్ తర్వాత వచ్చే సీన్లన్ని అద్భుతంగా పండటమే కాదు, సీట్లో ఆడియెన్‌ని కూర్చోనివ్వవంటే నమ్మాలి. వెంటనే సెంటిమెంట్.. ‘నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు.. ఇవాళ నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది’ అని డింపుల్ చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ‘ఇక లాభం లేదు లీల.. ఇద్దరికీ నిజం చెప్పేస్తాను’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ సినిమాకు ఎంతో కీలకమైనదనే విషయం తెలిసిపోతుంది. అసలు విషయం చెప్పడానికి సిద్ధమైన రవితేజకు.. ‘నీకు పెళ్లైనా సరే.. నాతో అలా ఉన్నావంటే.. బాలామణికి డిస్‌కనెక్ట్ అయ్యి, హార్ట్‌ఫుల్‌గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా?’ అని ఆషిక.. ‘అన్ని రకాలుగా బానే చూసుకుంటున్నాను కదా.. నేనుండగా ఇంకో అమ్మాయి నీ లైఫ్‌లోకి ఎందుకొచ్చింది?’ అని డింపుల్.. మళ్లీ అడ్డంగా బుక్ చేయడం చూస్తుంటే.. ఇది ఎప్పటికీ తెగని సంసారం అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. దీనికి సింక్ అయ్యేలా చివరిలో ‘ఏడు కొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంత పని చేశావు’ అనే పాటను ప్లే చేయడం చూస్తుంటే దర్శకుడి ఈ సినిమా హ్యాండిల్ చేసిన తీరు.. కచ్చితంగా బ్లాక్‌బస్టరే అనే ఫీల్ ఇస్తోంది. మొత్తంగా అయితే, ఈ ట్రైలర్.. మాస్ రాజా చాలా కొత్తగా ట్రై చేశాడనే విషయంతో పాటు, మంచి కంటెంట్ ఉన్న సినిమాతో రాబోతున్నాడనే విషయాన్ని 100 శాతం రీచ్ అయ్యేలా చేసిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

