Sankranthi 2026 Buses: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది.
ఆ ఏరియాల్లో స్పెషల్ బస్సులు
హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS), ఉప్పల్ క్రాస్ రోడ్స్ (Uppal X Roads), ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ (LB Nagar X Roads), కేపీహెచ్‌బీ (KPHB), బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ఆ బస్సుల్లో సాధారణ ఛార్జీలే..
2003 నాటి జీవో నంబర్ 16 ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను పెంచనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ఈ నెల 9, 10, 12,13 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయిని స్పష్టం చేసింది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని తేల్చి చెప్పింది.
Also Read: Indian Railways: రైళ్ల విద్యుదీకరణలో సరికొత్త రికార్డు.. వరల్డ్‌లోనే భారత్‌కు రెండో స్థానం
మహిళల ఉచిత ప్రయాణంపై..
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆర్టీసీ ప్రకటిచింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లకు సంప్రదించాలని సూచించింది.

