Hyderabad Blast Plot: హైదరాబాద్ పేలుళ్ల కుట్రలో తవ్వినకొద్దీ సంచలన వివరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న సిరాజ్ యువకులను జిహాద్ వైపు మళ్లించి వారిని మానవ బాంబులుగా తయారు చేయాలని పన్నాగం పన్నినట్టుగా వెల్లడైంది. దీని కోసం వేర్వేరు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని కుట్రలు చేసినట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో సిరాజ్ తోపాటు సమీర్ ను కస్టడీకి తీసుకుని మరింత క్షుణ్నంగా విచారించాలని ఇటు పోలీసులు అటు ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు.
హైదరాబాద్‌లో పేలుళ్లు సృష్టించటానికి కుట్ర చేసిన విజయనగరం వాస్తవ్యుడు సిరాజ్ఉర్ రహమాన్, హైదరాబాద్ బోయిగూడ నివాసి సమీర్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సిరాజ్ నుంచి పోలీసులు బాంబులు తయారు చేయటానికి ఉపయోగించే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం టిఫిన్బాంబులతో పేలుళ్లు సృష్టించటంతోపాటు ఊహించని రక్తపాతం సృష్టించటానికి మానవ బాంబులను కూడా తయారు చేయాలని కుట్రలు పన్నాడు. నిజానికి మెకానికల్ ఇంజనీరింగ్చదివిన సిరాజ్ ఎస్సై పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్ వచ్చాడు. దీనికి సంబంధించిన దాంతోపాటు గ్రూప్1పరీక్షల కోచింగ్ కూడా తీసుకున్నాడు. పరీక్షలు కూడా రాశాడు. అయితే, ఉత్తీర్ణత సాధించ లేకపోయాడు. కాగా, హైదరాబాద్ లో ఉంటున్నపుడు అతనికి బోయిగూడ నివాసి సమీర్‌తో పరిచయం ఏర్పడింది. అతని ద్వారా వరంగల్ కు చెందిన ఫర్హాన్మొయినుద్దీన్, ఉత్తర ప్రదేశ్ కు చెందిన బాబర్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. కొన్ని రోజుల్లోనే క్లోజ్‌గా మారిన ఈ నలుగురు దాదాపుగా ప్రతీ రోజూ కలుసుకునే వారు. డాక్టర్ఇష్రార్ అహమద్, జాకీర్, షేక్ జావీద్ రబ్బానీ తదితరుల ప్రసంగాలను వినేవారు. వీటి ప్రభావంతో తరచూ జిహాద్ గురించి చర్చించుకునేవారు.
Also Read: Medchal Drainage system: గ్రామాల్లో కనిపించని అభివృద్ధి.. సమస్యలపై పట్టింపేది!
ఆ సమయంలోనే ముస్లిం యువతులను కొందరు ముస్లిమేతరులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటామని మోసాలు చేస్తున్నారని, దీనిపై యువకుల్లో అవగాహన కల్పించాలని అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గ్రూప్ ను ఇన్ స్టాగ్రాంలో ప్రారంభించారు. దీని ద్వారానే మరికొందరు యువకులను కూడా తమ భావజాలం వైపు తిప్పుకోవాలని భావించారు. దీంట్లో భాగంగా గత యేడాది నవంబర్ లో ముంబయికి వెళ్లారు. అక్కడ అద్నాన్, దిల్షాన్, మొహిసిన్ షేక్, జహీర్ ను కలిశారు. అంతా కలిసి ఓ షోకు కూడా హాజరయ్యారు. ఇక, ఈ యేడాది మొదట్లో షహబాజ్, జీషన్ అనే వ్యక్తులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. అయితే, షహబాజ్ అప్పటికే విదేశాలకు వెళ్లి పోవటంతో వీరిని కలవలేదు. ఆ తరువాత రాజస్థాన్ వెళ్లి సల్మాన్ అనే వ్యక్తిని కలిశారు. ఇక, వీరికి హ్యాండ్లర్లుగా బీహార్ రాష్ట్రానికి చెంది ప్రస్తుతం సౌదీలో ఉంటున్న అబ్బూ, ముసబ్ లు వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం. వీరి సూచనల మేరకు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా గ్రూప్ సభ్యులు మాట్లాడుకునే వాళ్లని తెలిసింది.
మానవ బాంబుల కుట్ర
ఇలా ఉగ్రవాదం వైపు మళ్లిన సిరాజ్, సమీర్ లు అవసరమైతే మానవ బాంబులను తయారు చేయాలని కూడా కుట్రలు చేశారు. దీని కోసం యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించాలని పన్నాగాలు పన్నారు. దీని కోసం గతంలో జరిగిన మత కల్లోలాల వీడియోలతోపాటు రెచ్చగొట్టే ప్రసంగాల వీడియోలను కూడా సమకూర్చి పెట్టుకున్నారు. అవసరమైతే ప్రాణ త్యాగం చేయటానికి కూడా వెనుకాడ వద్దని నిర్ణయించుకున్నారు. ఇక, వీరికి ఇమ్రాన్ అక్రం అనే వ్యక్తి పేలుడు పదార్థాలు కొనటానికి డబ్బు సమకూర్చాడు. దీనిపై ఓ సీనియర్ అధికారితో మాట్లాడగా సిరాజ్, సమీర్ లను కస్టడీకి తీసుకుని నిశితంగా విచారిస్తే అన్ని వివరాలు స్పష్టమవుతాయన్నారు.
Also Read: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో కీలక సూత్రధారిని పట్టుకున్న పోలీసులు?