HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కోకాపేట, మూసాపేటలలో అభివృద్ధి చేసిన భారీ లేఅవుట్‌లలోని ప్లాట్ల వేలం ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. గత నెల 24 నుంచి ఈ నెల 5వరకు నాలుగు విడుతలుగా చేపట్టిన ఈ-వేలం పాట ద్వారా హెచ్ఎండీఏకు మొత్తం రూ.3862.8 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆదాయం రూ.5 వేల కోట్లు దాటవచ్చని అంచనా వేసినప్పటికీ, అంచనాలు తారుమారై ఆదాయం కొంత తగ్గింది. గతంలో 2023లో నిర్వహించిన వేలంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌లోని ఎకరం భూమి రూ.100.75 కోట్ల రికార్డు స్థాయి ధర పలికిన నేపథ్యంలో, ఈసారి ఆ భూములకు ప్రారంభ ధరను రూ.99 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి.
రికార్డు స్థాయి ధర
నవంబర్ 29న జరిగిన వేలంలో నియోపోలిస్ లేఅవుట్‌లోని ప్లాట్ నెంబర్ 15 (4.3 ఎకరాలు)లోని ఎకరం భూమి ఏకంగా రూ.151.25 కోట్లు రికార్డు ధర పలికింది. ప్లాట్ నెంబర్ 16 (5.3 ఎకరాలు)లోని ఎకరం భూమి కూడా రూ.147.75 కోట్ల రికార్డు స్థాయి ధర పలికింది. డిసెంబర్ 3న జరిగిన మూడో విడుత వేలంలోనూ నియోపోలిస్ భూములు రికార్డు ధరలు పలికాయి. ఈ విడుతలో ప్లాట్ నెంబర్ 19లో ఉన్న ఎకరానికి రూ.131 కోట్లు, ప్లాట్ నెంబర్ 20లోని ఎకరానికి రూ.118 కోట్ల చొప్పున ధర పలికింది.
Also Read: Guard of Honor: రాష్ట్రపతి భవన్‌లో అధ్యక్షుడు పుతిన్‌కు ‘గార్డ్ ఆఫ్ హానర్స్’ స్వాగతం.. వీడియో ఇదిగో
గోల్డ్ నైన్‌లోనూ భారీ ఆదాయం
శుక్రవారం నిర్వహించిన చివరి, నాలుగో విడుత వేలం పాటలో కోకాపేట గోల్డెన్ మైల్లోని 1.98 ఎకరాల స్థలాన్ని సియోస్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా, మేడ్చల్ జిల్లాలోని మూసాపేటలో 15 ఎకరాల విక్రయ ప్రతిపాదనను హెచ్ఎండీఏ అధికారులు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. గత నెల 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించిన మొత్తం మూడు విడుతల్లో 27 ఎకరాల భూ విక్రయంతో రూ.3,708 కోట్ల ఆదాయం సమకూరగా, శుక్రవారం జరిగిన చివరి వేలం ద్వారా మొత్తం ఆదాయం రూ.3862.8 కోట్లకు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: IND vs SA 3rd ODI: వైజాగ్‌లో నిర్ణయాత్మక మ్యాచ్.. మూడో వన్డే గెలిచేదెవరు? సిరీస్‌ను సాధించేదెవరు?

