Guard of Honor: రెండు రోజుల పర్యటన కోసం గురువారం నాడు భారత్ విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు (Vladimir Putin) శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో (ఫోర్‌కోర్ట్) ‘గార్డ్ ఆఫ్ హానర్స్’ (Guard of Honor) స్వాగతాన్ని అందుకున్నారు. భారత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత భారత్, రష్యా దేశాల జాతీయ గీతాలను ఆలపించారు. గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత, రెడ్ కార్పెట్‌పై నడుస్తూ త్రివిధ దళాల కవాతును పుతిన్ ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), జనరల్ అనిల్ చౌహాన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also- Actress Pragathi: నవ్వుకున్న వాళ్లందరికీ ఇదే ప్రగతి ఆన్సర్.. ఇండియా తరపున టర్కీ ఏషియన్ గేమ్స్‌కు!
‘గార్డ్ ఆఫ్ హానర్’ స్వాగత కార్యక్రమం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇరు దేశాల ప్రతినిధి బృందాలలోని అధికారులను పరస్పరం పరిచయం చేసుకున్నారు. రష్యా ప్రతినిధుల బృందంలో ఆ దేశ రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్‌తో పాటు పలువురు కీలక అధికారులు ఉన్నారు. అనంతరం పుతిన్ నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు.
అంతకుముందు శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్య సహకారం, మాడ్యులర్ రియాక్టర్లలో సహకారంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై ఇరుదేశాల అధినేతలు చర్చలు జరిపారు. ముఖ్యంగా రక్షణ, వాణిజ్య రంగాల్లోని పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ, రష్యా-భారత్ వాణిజ్య బంధాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత పుతిన్ తిరిగి స్వదేశానికి బయలుదేరనున్నారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ పాలం ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలికారు. మోదీ విమానాశ్రయానికి వస్తారనే సమాచారం లేకపోవడంతో రష్యా ప్రతినిధుల బృందం ఒకింత ఆశ్చర్యపోయింది.
Read Also- Ram Gopal Varma: వర్మ తనలోని ఇంకొకడ్ని తీశాడయ్యో.. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ న్యూ అవతార్!
President of Russia Vladimir Putin receives a Guard of Honour at the Rashtrapati Bhawan in New Delhi
Watch:@rashtrapatibhvn pic.twitter.com/j20wz7hYRd
— PIB India (@PIB_India) December 5, 2025

