HCA Scam (N IMAGE credit: swetcha reporter)
హైదరాబాద్

HCA Scam: జగన్మోహన్​ రావు టైంలో హెచ్​సీఏ ఎన్నో అక్రమాలు.. తెలిస్తే షాక్?

HCA Scam: అడ్డదారుల్లో హెచ్​సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన జగన్మోహన్ రావు(Jaganmohan Rao) హయాంలో జరిగిన అక్రమాలు (HCA Scam) అన్నీ ఇన్నీ కావు. క్రికెట్ బాళ్లు మొదలుకుని ప్రతీ దాంట్లో లక్షల లూటీ జరిగింది. ఇక, ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే జగన్మోహన్​ రావు అండ్ కంపెనీకి పండుగే. కాంప్లిమెంటరీ టిక్కెట్లను బ్లాక్​ లో అమ్ముకోవటం…వచ్చిన డబ్బును తలా కొంత పంచుకోవటం. టిక్కెట్ల కోసం జగన్మోహన్​ రావు బృందం పెట్టిన ఇబ్బందులతో విసిగిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఓ దశలో తమ ఫ్రాంచైజీని ఆంధ్రప్రదేశ్ కు మార్చుకుంటామని ప్రకటించటం గమనార్హం.

 Also Read: Mirai songs: ‘మిరాయ్’ ఫైనల్ ఎడిటింగ్‌లో సాంగ్స్ అవుట్.. తీసేసింది అందుకేనా?

మార్కెట్ రేటుకన్నా మూడింతలకు…

రంజీ మ్యాచ్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. కారణం ఈ పోటీల్లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్టార్ క్రికెటర్లు కూడా ఆడుతుంటారు. ఈ మ్యాచుల్లో సాధారణంగా మన దేశానికి చెందిన సాన్స్​ పరెలీస్ గ్రీన్​ ల్యాండ్స్​ (ఎస్​జీ) కంపెనీ తయారు చేసిన క్రికెట్ బాళ్లను వాడుతుంటారు. రంజీల్లో ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ క్రికెటర్ చెప్పిన ప్రకారం వీటి ధర 4‌‌‌‌00 నుంచి 500 రూపాయలు ఉంటుంది. ఇక, క్లబ్ మ్యాచుల్లో వాడే క్రికెట్ బాల్ రేటు 300 రూపాయల వరకు ఉంటుంది. అయితే, ఘనత వహించిన మన హెచ్​సీఏ మాత్రం ఒక్కో బాల్ ను 1,199 రూపాయలకు కొనుగోలు చేసింది. 8,340 క్రికెట్ బాళ్ల కోసం అక్షరాలా కోటి రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కల్లో చూపించింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఒక్కటంటే ఒక్క క్రికెట్ బాల్ కూడా సప్లయ్ కాకపోవటం.

అసలు ఈ వ్యవహారం ఏంది? అని ఆరా తీయగా హెచ్​సీఏకు కోశాధికారిగా పని చేసిన సురేందర్ అగర్వాల్ ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్టుగా తెలిసింది. అప్పటి హెచ్​సీఏ అధ్యక్షుడు జగన్మోహన్​ రావు అండతో తనకు బాగా పరిచయం ఉన్న సారా స్పోర్ట్స్ సంస్థకు క్రికెట్ బాళ్ల కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా వెల్లడైంది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకుగాను సదరు సారా స్పోర్ట్స్ సంస్థ యాజమాన్యం 17 లక్షల రూపాయలను సురేందర్ అగర్వాల్ భార్య భాగస్వామిగా ఉన్న కేబీ జువెలరీ సంస్థ ఖాతాతోపాటు ఆమె వ్యక్తిగత అకౌంట్ లో జమ చేసింది. దాంతోపాటు సురేందర్ అగర్వాల్ కుమారుడు అక్షిత్ అగర్వాల్ ఖాతాలోకి కూడా కొంత నగదును ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ నగదును ఓ మ్యూజిక్​ షోను స్పాన్సర్ చేసినట్టుగా చెప్పి బదిలీ చేయటం గమనార్హం.

 

బకెట్ కుర్చీల కాంట్రాక్ట్ లోనూ…

ఉప్పల్ స్టేడియంలో బకెట్ కుర్చీల ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టులోనూ ఇదే బాగోతం నడిచింది. బకెట్ కుర్చీలను సరఫరా చేసిన ఎక్స్​ లెంట్ ఎంటర్ ప్రైజెస్​ సంస్థ సురేందర్ అగర్వాల్, అతని కొడుకు అక్షిత్ అగర్వాల్​ ఖాతాతోపాటు కేబీ జువెలర్స్ నుంచి వజ్రాలు కొన్నట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి 21.86 లక్షల రూపాయలను ఆయా అకౌంట్లలో జమ చేసింది. జిమ్​ పరికరాలను సప్లయ్ చేసిన బాడీ ట్రెంచ్​ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం 52 లక్షల రూపాయలను సురేందర్ అగర్వాల్, ఆయన కోడలి ఖాతాల్లోకి ట్రాన్స్​ ఫర్ చేసింది. ఈ అన్ని కాంట్రాక్టుల విలువ కోట్లలోనే ఉండటం గమనార్హం. కాంట్రాక్టులు ఇచ్చినందుకే కమీషన్​ గా లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఎంత భారీ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాంట్రాక్టులన్నీ జగన్మోహన్​ రావు హెచ్సీఏ అధ్యక్షునిగా ఉన్నపుడే ఇవ్వటం గమనార్హం. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఎన్​ ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సురేందర్ అగర్వాల్, ఆయన కుటుంబ సభ్యుల పేరన ఉన్న 51.29 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్​ చేశారు.

 Also Read: GHMC: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాల చెల్లింపులకు లైన్ క్లియర్!

ఐపీఎల్ వస్తే…

ఇక, కోట్లాది మంది కన్నార్పకుండా చూసే ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ వస్తే జగన్మోహన్ రావు అండ్ కంపెనీ పండుగ చేసుకునేది. కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతీ మ్యాచ్​ కు సన్​ రైజర్స్ యాజమాన్యం 3,900 కాంప్లిమెంటరీ పాస్​ లు ఇచ్చేది. లెక్క ప్రకారం వీటిని తెలిసిన వారికి ఉచితంగా ఇవ్వాలి. అయితే, జగన్మోహన్ రావు, హెచ్​సీఏలోని ఆయన సహచరులు కొందరు వీటిలో సింహ భాగం టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా అడ్డంగా సంపాదించటానికి మరిగిన జగన్మోహన్​ రావు అండ్ కంపెనీ ఇస్తున్న 3,90‌‌0 టిక్కెట్లకు అదనంగా అంతే సంఖ్యలో అదనంగా టిక్కెట్లు ఇవ్వాలని సన్ రైజర్స్​ హైదరాబాద్ యాజమాన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. వీఐపీ బాక్స్​ టిక్కట్లు కూడా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దానికి సన్ రైజర్స్​ యాజమాన్యం నిరాకరించటంతో మ్యాచ్​ లు జరిగినపుడు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేశారు.

జగన్మోహన్ రావు, అతని సహచరుల బ్లాక్​ మెయిలింగ్ భరించలేని స్థాయికి చేరుకోవటంతో ఓ దశలో తాము హైదరాబాద్ ను విడిచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోతామంటూ సన్ రైజర్స్​ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. ఓ వైపు హైదరాబాద్ ను బ్రాండ్ సిటీగా తీర్చి దిద్దటానికి కృషి చేస్తున్న సమయంలో ఈ పరిణామం సంభవించటంతో అసలేం జరిగిందో తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి అదనపు టిక్కెట్ల కోసం జగన్మోహన్ రావుతోపాటు హెచ్​సీఏలోని మరికొందరు పెద్దలు సన్ రైజర్స్​ హైదరాబాద్ యాజమాన్యాన్ని వేధించినట్టుగా నిర్ధారించారు కూడా. ఈ క్రమంలో ఉన్న పదవులు ఎక్కడ ఊడుతాయో అని భయపడ్డ జగన్మోహన్​ రావు అండ్ కంపెనీ ఆదరాబాదరగా సన్ రైజర్స్​ హైదరాబాద్ యాజమాన్యం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాజీ కుదుర్చుకుంది. గతంలో ఇచ్చినట్టుగా 3,90‌‌0 కాంప్లిమెంటరీ టిక్కెట్లు ఇస్తే చాలని చెప్పింది. ఆ తరువాత కళ్లు మూసుకుని పాలు తాగిన పిల్లి చందాన టిక్కెట్ల విషయంలో సన్​ రైజర్స్​ హైదరాబాద్ యాజమాన్యంతో ఎలాంటి సమస్య లేదని…రాజీ కుదిరిందని ప్రకటించింది.

 Also Read: BRS Sheep Scam: గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కదలిక.. ఈడీ నోటీసులు..?

Just In

01

Ambedkar University: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ

Anupama Parameswaran: థియేటర్లలోకి ‘కిష్కింధపురి’.. సైలెంట్‌గా ఓటీటీలోకి మరో సినిమా!

Hyderabad Crime News: రేణు అగర్వాల్ హత్య కేసులో.. కీలక ఆధారాలు వేలుగులోకి?.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

BRAOU Admissions: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు