Golkonda Kidnap Case: నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో గోల్కొండ పోలీసులు 24గంటల్లో మిస్టరీని ఛేధించారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీ కృష్ణాగౌడ్, టోలీచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, గోల్కొండ సీఐ సైదులుతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
తిరిగి రాకపోవడంతో..
గోల్కొండ ప్రాంతంలోని సలేహ్ నగర్ కంచ ప్రాంత వాస్తవ్యులైన నుజాత్ ఫాతిమా, షేక్ ముజమ్మిల్ లు భార్యాభర్తలు. వీరి కూతురు సఫియా బేగం (4). ఇదిలా ఉండగా నుజాత్ ఫాతిమా ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలోనే ఆమె తల్లి నసీం బేగం నివాసముంటోంది. శనివారం కూతురికి ఫోన్ చేసిన నసీం బేగం మనవరాలైన సఫియా బేగంను తన ఇంటికి పంపించమని చెప్పింది. ఈ క్రమంలో సఫియా బేగం అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అయితే, గంటలు గడిచిపోయిన ఇంటికి తిరిగి రాలేదు. దాంతో నుజాత్ ఫాతిమా తల్లికి ఫోన్ చేయగా చాలాసేపు క్రితమే సఫియా ఇంటికి బయల్దేరి వెళ్లిందన్న సమాధానం వచ్చింది. దాంతో కంగారు పడ్డ నుజాత్ ఫాతిమా పరిసర ప్రాంతాలు మొత్తం వెతికింది. కూతురి ఆచూకీ తెలియక పోవటంతో గోల్కండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఎస్ఐ రాము నాయుడు, డీఎస్ఐ ఆంజనేయులు వెంటనే సిబ్బందితో కలిసి సలేహ్ నగర్ కంచ బస్తీకి వెళ్లారు. నసీం బేగం ఇంటికి వెళ్లే దారుల్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని అప్పటికప్పుడు సేకరించారు. వీటిని విశ్లేషించగా బురఖా ధరించిన ఓ మహిళ ఆటోడ్రైవర్ తో కలిసి సఫియా బేగంను కిడ్నాప్ చేసినట్టుగా స్పష్టమైంది. అయితే, ఫుటేజీలో ఆటో నెంబర్ సరిగ్గా కనిపించ లేదు. దాంతో తొమ్మిది ప్రత్యేక బృందాలతోపాటు ఇన్ఫార్మర్లను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ఆటో టోలీచౌకీ హకీంపేటలో నివాసముంటున్న మహ్మద్ ఫయాజ్ (25)దని వెల్లడైంది. వెంటనే అతని ఇంటికి వెళ్లిన పోలీసులు మహ్మద్ ఫయాజ్ ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన మాజీ భార్య సమ్రీన్ బేగంతో కలిసి కిడ్నాప్ చేసినట్టు అతను వెల్లడించగా ఆమెను కూడా అరెస్ట్ చేశారు.
Also Read: Akhanda 2: ‘ఓజీ’ రేంజ్లో కలెక్షన్స్ రాబడితేనే.. కొండంత బ్రేకీవెన్ టార్గెట్!
ఇంట్లోవాళ్లను ఒప్పంచటానికి..
నిజానికి మహ్మద్ ఫయాజ్, సమ్రీన్ బేగంల వివాహం కొన్నేళ్ల క్రితం జరిగింది. ఆ తరువాత విభేధాలు తలెత్తటంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం మహ్మద్ ఫయాజ్ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కాగా, కొన్నిరోజుల క్రితం సమ్రీన్ బేగం మళ్లీ అతని జీవితంలోకి వచ్చింది. అయితే, సమ్రీన్ బేగంతో కలిసి ఉండటానికి మహ్మద్ ఫయాజ్ తల్లిదండ్రలు ఒప్పుకోలేదు. దాంతో బాలికను కిడ్నాప్ చేసి తమకు పుట్టిన బిడ్డే అని చెప్పి ఇంట్లో వాళ్లను ఒప్పంచాలని ఇద్దరు కలిసి పథకం వేశారు. దాని ప్రకారం సఫాయా బేగంను కిడ్నాప్ చేశారు. సమ్రీన్ బేగం ఇంట్లో నిర్భంధంలో ఉన్న సఫియా బేగంను చెర విడిపించిన పోలీసులు చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు ఇద్దరిపై కేసులు నమోదు చేసి జైలుకు రిమాండ్ చేశారు.

